తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​ 'అణు' దూకుడు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు!

యురేనియం శుద్ధిని 60 శాతానికి పెంచనున్నట్లు ఇరాన్​ ప్రకటించింది. నతాంజ్​లోని తన అణు కార్మాగారంపై సైబర్​ దాడి జరిగిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్.. యురేనియాన్ని 20 శాతం మేర శుద్ధి చేస్తోంది.

iran increases uranium enrichment to 60 percent
యురేనియం శుద్ధిని 60 శాతానికి పెంచిన ఇరాన్​

By

Published : Apr 14, 2021, 6:50 AM IST

అణు అంశంపై ఇరాన్ తన దూకుడును పెంచింది. తన యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని 60 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే అణ్వాయుధ గ్రేడు స్థాయి శుద్ధిని సాధించడానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటుంది. నతాంజ్​లోని తన అణు కార్మాగారంపై సైబర్​ దాడి జరిగిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుుకుంది. దీనివల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్.. యురేనియాన్ని 20 శాతం మేర శుద్ధి చేస్తోంది. అయితే అణుబాంబులో ఉపయోగించడానికి 90 శాతం శుద్ధత అవసరం. 60 శాతం మేర శుద్ధి చేసిన యురేనియాన్ని అణుశక్తితో నడిచే యుద్ధనౌకల్లో ఉపయోగించే వీలుందని ఇరాన్ గతంలో తెలిపింది. అయితే ఆ దేశం వద్ద ఇలాంటి యుద్ధనౌకలేవీ లేవు. నతాంజ్​లోని ఇరాన్​ అణు కర్మాగారంలో ఇటీవల అనూహ్యంగా విద్యుత్​ పంపిణీ వ్యవస్థ కుప్పకూలి, అంధకారం నెలకొంది. ఇది తమ దేశ సైబర్ దాడి అని ఇజ్రాయెల్ పేర్కొన్న నేపథ్యంలో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

'విద్రోహ చర్యలు'

మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని కూడా ఇరాన్​ అణు కార్యక్రమాన్ని ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అణుశుద్ధి స్థాయిని పెంచాలని నిర్ణయించినట్లు ఇరాన్ అణు చర్చల ప్రతినిధి అబ్బాస్​ అరాగ్చి పేర్కొన్నారు. నతాంజ్​లో మరో వెయ్యి సెంట్రిఫ్యూజులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. మరోవైపు నతాంజ్​ ఘటనలో ఇజ్రాయెల్ పాత్ర ఉన్నట్లు తేలితే.. ప్రతీకార చర్యలు ఉంటాయని ఇరాన్​ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్​ మంగళవారం పునరుద్ఘాటించారు. ఇలాంటి విద్రోహ చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని అమెరికా కూడా గుర్తించాలన్నారు.

ఇరాన్​ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు అగ్రరాజ్యాలతో కుదిరిన కీలక ఒప్పందాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికా సహా పలు దేశాలు ప్రయత్నాలు చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో వాటికి విఘాతం కలిగే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చదవండి :'భాజపా బెదిరింపు వ్యూహాలకు భయపడను'

'అంబేడ్కర్​ స్ఫూర్తితో శక్తిమంతమైన భారత్'​

ABOUT THE AUTHOR

...view details