లెబనాన్ రాజధాని బీరుట్‌లో భారీ పేలుడు తర్వాత పరిస్థితి నానాటికి దిగజారుతోంది. నగరానికి అవసరమైన ఆహార ధాన్యాల గోదాము ఓడరేవులోనే ఉండటంతో ధ్వంసమైపోయింది. నోటికందాల్సిన ఆహారం నీటిపాలైంది. ఆ పేలుడు తీవ్రతకు దాదాపు 5,000 మంది గాయపడ్డారు. కానీ, వీరికి చికిత్సను అందించేందుకు తగినన్ని ఆసుపత్రులు అందుబాటులో లేవు. పులిమీద పుట్రలాగా.. నగరంలోని దాదాపు సగం ఆసుపత్రులు పనికిరాని స్థితికి చేరుకొన్నాయి.
నగరంలోని ఆసుపత్రుల్లోని ఎమర్జెన్సీ గదులు నిరుపయోగంగా మారాయి. చాలా ఆసుపత్రుల్లో పరికరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే వెల్లడించింది. బీరుట్‌లో మొత్తం 55 క్లినిక్‌లు ఉన్నాయి. వీటిల్లో సగం పనిచేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజనల్ డైరెక్టర్ రిచర్డ్ బ్రెన్నన్ తెలిపారు. వీటిల్లో మూడు పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. మృతుల సంఖ్య 170ని దాటినట్లు సమాచారం.