తెలంగాణ

telangana

ETV Bharat / international

లెబనాన్​ రాజధాని​లో భారీ పేలుడు- 73 మంది మృతి - windows

Huge explosion in Lebanon's capital Beirut. More details awaited.
లెబనాన్​ రాజధాని బీరుట్​లో భారీ పేలుడు

By

Published : Aug 4, 2020, 9:28 PM IST

Updated : Aug 5, 2020, 5:23 AM IST

02:26 August 05

3,700 మందికి పైగా గాయాలు

లెబనాన్​ రాజధాని బీరుట్​లో భారీ పేలుడు

లెబనాన్​ రాజధాని బీరుట్​లో భయంకరమైన పేలుడు సంభవించింది. నగరంలోని నౌకాశ్రయం కేంద్రంగా జరిగిన ఈ పేలుడులో 73 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 3,700 మందికి పైగా గాయపడ్డట్లు వెల్లడించారు. అత్యవసర ప్రతిస్పందన దళాలు వెంటనే రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టినట్లు లెబనాన్ వైద్య శాఖ మంత్రి హసన్ హమద్ స్పష్టం చేశారు.  

అత్యంత తీవ్రంగా

మధ్యాహ్నం సమయంలో జరిగిన పేలుడుకి రాజధాని నగరం వణికిపోయింది. సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవహించింది. ఇళ్ల పైకప్పులు పడిపోయాయి. కిటికీలు ఎగిరిపోయాయి. భీకరమైన పేలుడు ధాటికి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.  

బీరుట్​లోని నౌకాశ్రయం కేంద్రంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు పోర్టులో మంటలు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను హెలికాఫ్టర్లు, అగ్నిమాపక యంత్రాల సాయంతో ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  

పేలుడు తర్వాత సమీప ప్రాంతంలో వినాశకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. బీరుట్​కు 200 కి.మీ దూరంలో ఉన్న సైప్రస్ వరకు పేలుడు శబ్దం వినిపించింది. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లపైనా పేలుడు ప్రభావం కనిపించింది. సెంట్రల్ బీరుట్​లో భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. 

పేలుడు ధాటికి సమీప ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు జర్మనీ జియోసైన్సెస్​ సెంటర్ వెల్లడించింది. రిక్టర్​పై తీవ్రత 3.5గా నమోదైనట్లు తెలిపింది.

కారణాలు!

ఈ విధ్వంసకర పేలుడుకు కారణాలు తెలియరాలేదు. అయితే.. కొంతకాలం క్రితం ఓడల నుంచి జప్తు చేసి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వల్లే ఈ ఘటన సంభవించిందని లెబనీస్ జనరల్ సెక్యూరిటీ ఛీఫ్ అబ్బాస్ ఇబ్రహీం అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు.. పేలుడు పధార్థాల్లో సోడియం నైట్రేట్​ ఉందని స్థానిక మీడియా పేర్కొంది. టపాసులు నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు చెబుతోంది. 

పేలుడు ధాటికి శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  

మరోవైపు.. ఈ ఘటనకు కారణమైనవారిని విడిచిపెట్టేది లేదని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దయాబ్​ ఉద్ఘాటించారు. నిందితులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్​తో ఉద్రిక్తతల మధ్య..!

లెబనాన్ దక్షిణ సరిహద్దులో ఉండే ఉగ్రవాద ముఠా హెజ్బోల్లాకు ఇజ్రాయెల్​కు మధ్య ఇటీవల ఉద్రిక్తతలు అధికమయ్యాయి. అవసరమైతే హెజ్బొల్లాపై దాడి చేసేందుకు వెనకాడబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు మంగళవారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పేలుడు జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

కారు బాంబుతో 2005లో మాజీ ప్రధాని రఫిక్ హరిరిని హత్యచేసిన కేసులో ఐక్య రాజ్యసమితి ప్యానెల్ శుక్రవారం తీర్పునివ్వనుంది. ఈ నేపథ్యంలో పేలుడు సంభవించడం గమనార్హం.

భారత రాయబార కార్యాలయం

లెబనాన్​లో పేలుడుపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. కార్యాలయంలోని ఉద్యోగులందరూ సురక్షితంగానే ఉన్నట్లు లెబనాన్​లోని భారత రాయబారి సుహెల్ అజాజ్​ ఖాన్ తెలిపారు. అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

22:58 August 04

లెబనాన్​ రాజధాని బీరుట్​లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మందికిపైగా మరణించినట్లు ఆ దేశ వైద్య శాఖ మంత్రి వెల్లడించారు. 2,500 మందికి పైగా మంది గాయపడ్డట్లు తెలిపారు. భీకరమైన పేలుడు ధాటికి భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.  

మధ్యాహ్నం సమయంలో జరిగిన పేలుడుకి రాజధాని నగరం వణికిపోయింది. సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవహించింది. ఇళ్ల పైకప్పులు పడిపోయాయి. కిటికీలు ఎగిరిపోయాయని స్థానికులు వెల్లడించారు.

బీరుట్​లోని నౌకాశ్రయం కేంద్రంగా పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్లపైనా పేలుడు ప్రభావం కనిపించింది. సెంట్రల్ బీరుట్​లో భారీగా నష్టం సంభవించినట్లు సమాచారం. టపాసులు నిల్వ ఉంచిన ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు స్థానిక టీవీ ఛానెళ్లు చెబుతున్నాయి.

21:26 August 04

లెబనాన్​ రాజధాని బీరుట్​లో భారీ పేలుడు

లెబనాన్​ దేశ రాజధాని బీరుట్​లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు విధ్వంసం ధాటికి దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. కిటికీలు కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డట్లు స్థానికులు అంటున్నారు. చాలా మంది గాయపడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మీడియా నివేదికల ప్రకారం.. బీరుట్​ పోర్ట్​లో టపాసులు నిల్వఉంచిన ప్రదేశంలో పేలుడు సంభవించిందని తెలుస్తోంది. 

Last Updated : Aug 5, 2020, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details