అది 2014 నవంబర్ రెండో వారం.. ఉత్తర అమెరికా యూదుల ఫెడరేషన్ సదస్సు జరుగుతోంది. నాటి ఉపాధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.."మీరు బీబీకి చెప్పండి. ఇప్పటికీ తను నా బెస్ట్‌ఫ్రెండ్. ఆయన నాకు దాదాపు 30 ఏళ్ల నుంచి మిత్రుడు. నాకు బీబీకి అభిప్రాయభేదాలు ఉండొచ్చు.. కానీ, ఐ లవ్ యూ" అని ప్రేక్షకుల్లో కూర్చొన్న ఇజ్రాయెల్ రాయబారికి చెప్పారు. బైడెన్ పేర్కొన్న ఆ బీబీ ఎవరో కాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు.! బీబీ ఆయన ముద్దుపేరు. వాస్తవానికి నెతన్యాహు దూకుడు.. నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఇష్టం ఉండేది కాదు. అగ్రరాజ్య అధ్యక్షుడి కార్యవర్గం అప్పట్లో నెతన్యాహుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దానికి జో పై విధంగా వివరణ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో చాలా మంది 2021లో బైడెన్ అధికారంలోకి రాగానే నెతన్యాహును పక్కన పెట్టేశారని ప్రచారం చేశారు. కానీ, తాజాగా ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ సమయంలో వారిద్దరి మధ్య ఎంత సమన్వయం ఉందో బయటకు తెలిసింది. 'ఈ రోజు కాల్పుల విరమణ ప్రకటన ఉంటుందని నేను ఆశిస్తున్నాను' అని బైడెన్ ఈ నెల 19న.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పిన 24 గంటల్లో కాల్పుల విరమణ ప్రకటన వెలువడటం విశేషం.
ఇదీ చదవండి:గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం
ఇదీ చదవండి:ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై ప్రపంచ నేతల హర్షం
మిత్రుడిని ఇబ్బంది పడనీయలేదు..
ఈ మొత్తం వ్యవహారంలో జో బైడెన్ తన విదేశాంగ నీతి చతురతను చూపించారు. ఆయన బహిరంగంగా ఎక్కడా తన ఆత్మీయ దేశమైన ఇజ్రాయెల్‌ను విమర్శించలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌లో బెంజిమన్ నెతన్యాహు దూకుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన అలానే ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. ఇప్పుడు బైడెన్ బహిరంగంగా ఒత్తిడి తెస్తే దేశీయంగా ఆయన రాజకీయ ప్రతిష్ఠకు దెబ్బ. ఆయన మాట వినకపోవచ్చు కూడా. అందుకే కేవలం వ్యక్తిగత ఫోన్‌కాల్స్‌తో మంతనాలు చేశారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి దాదాపు నాలుగుసార్లకు పైగానే ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో కూడా నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు అంగీకరించలేదు. ఈ నెల 19న జరిగిన సంభాషణలో ఆ రోజు కాల్పుల విరమణ ఆశిస్తున్నట్లు చెప్పారని శ్వేతసౌధం పేర్కొంది.
ఓ పక్క.. బైడెన్ ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కుందని పదేపదే ప్రకటిస్తుండటంతో.. సొంత పార్టీ నుంచే ఒత్తిడి పెరిగిపోయింది. మిషిగాన్ ప్రతినిధి రషీద తలైబ్, సెనెటర్ క్రిస్ వాన్ హోలెన్, బర్నిశాండర్స్ వంటి వారు బహిరంగానే ఇజ్రాయెల్‌ను విమర్శించారు. ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను ఆపేయాలని కోరారు. అయినా.. జో చాలా వరకు నెతన్యాహును బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఐరాసలో భద్రతా మండలిలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వచ్చిన తీర్మానాలను అమెరికా అడ్డుకొంది. మరోవైపు.. ఫ్రాన్స్ వంటి దేశాలు ఐరాసలో కాల్పుల విరమణ తీర్మానాలపై పనిచేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ సమాజం, అమెరికా ఒత్తిడితో ఇజ్రాయెల్ దిగి వచ్చింది. బైడెన్ ఇబ్బందులు, పరిధి నెతన్యాహుకు బాగా తెలుసు. 24 గంటల్లో కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది.
ఇదీ చదవండి:ఇజ్రాయెల్ దాడుల్లో 6 నెలల మృత్యుంజయుడు!