ఇరాన్‌లో కనీసం రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సంక్రమించి ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ అన్నారు. మహమ్మారిని ప్రజలు తీవ్రంగా పరిగణించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ చేసిన అధ్యయనంలో గతంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
రాబోయే నెలల్లో మూడు నుంచి మూడున్నర కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని రౌహనీ అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని పేర్కొన్నారు. అయితే వేటి ఆధారంగా ఆ నివేదికను రూపొందించారో ఇరాన్ అధికారులు బహిర్గతం చేయలేదు. గత 150 రోజుల్లో ఆస్పత్రుల్లో చేరినవారి కన్నా రెట్టింపు సంఖ్యలో రాబోయే రోజుల్లో చేరతారని రౌహనీ అన్నారు.