కెవార్క్ టాన్షియన్... సైప్రస్ దేశీయుడు. అతనికి జైలులో పరిచయమైన బ్రెజిల్ దేశస్థుడు వెమ్స్ గాబ్రల్ ద కోస్టాతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. అయితే వాళ్లు కలుసుకున్న జైలులోనే ఒక్కటయ్యారు. సైప్రస్లోనే మిగిలిన జీవితాన్ని గడపాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.
టాన్షియన్, గాబ్రల్ స్వలింగ సంపర్కులు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లోనే ఇద్దరూ గతంలో అరెస్టయ్యారు. ఇద్దరు సైప్రస్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించారు. అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి గతం వీళ్లను మరింత దగ్గర చేసింది.
ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరి ప్రేమ బలపడింది. శిక్షా కాలం ముగిసి విడుదలైన టాన్షియన్... గాబ్రల్ను కలిసేందుకు మళ్లీ నేరం చేసి జైలుకెళ్లాడు. ఇలా ఒకటి కాదు... రెండు సార్లు చేశాడు.
ఇద్దరి గతం..
గాబ్రల్ స్వలింగ సంపర్కుడని తెలియటం వల్ల అతని కుటుంబం వెలివేసింది. వీధుల్లో తిరుగుతూ పొట్టపోసుకునేందుకు వ్యభిచారం చేశాడు. ఒక సమయంలో డబ్బు అవసరమై సైప్రస్‌కు డ్రగ్స్ సరఫరా చేసే పనిని అంగీకరించాడు గాబ్రల్. ఈ క్రమంలో సైప్రస్ విమానాశ్రయంలో అరెస్టయి 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు.