తాలిబన్లు అధికారం చేపట్టగానే పైకి చెప్పకపోయినా చుట్టుపక్కల దేశాలు తీవ్ర ఆందోళన చెందాయి. అక్కడి ఉగ్రవాదం తమ దేశాల్లోకి ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతున్నాయి. తాలిబన్ల విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న చైనా, రష్యాల్లో కూడా అంతర్గతంగా ఈ భయాందోళనలు ఉన్నాయి. పాకిస్థాన్ పైకి ఎన్నిచెప్పినా.. అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన కంచెను నిర్మించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్లిపోవడంతో తాలిబన్ల రాజ్యం (Taliban's return) వచ్చేసింది. దీంతో శరణార్థుల సమస్యలు, ఉగ్రవాదం వంటి సమస్యలు పొరుగు దేశాలను భయపెడుతున్నాయి.
వాస్తవానికి పాక్ ఫుల్ హ్యాపీనా..?
తాలిబన్లు అధికారం చేపడుతుంటే తొలుత కేరింతలు కొట్టింది పాకిస్థానే. ఒక దశలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాలిబన్ ప్రతినిధి వలే మాట్లాడారు. తాలిబన్లపై పాక్‌కు బలమైన పట్టుంది. దశాబ్దాలుగా వారికి ఆయుధాలు, మద్దతు అందిస్తూ పాక్ అండగా నిలిచింది. ఒక రకంగా ఇక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటం భారత్‌పై వ్యూహాత్మకంగా సాధించిన విజయంగా భావిస్తోంది. ఉగ్రశిబిరాలను కూడా ఇక్కడకు తరలించేందుకు ప్రణాళికలు కూడా ఉన్నాయి. అందుకే పాక్‌కు చెందిన దాదాపు 10వరకు ఉగ్ర సంస్థలు తాలిబన్ల తరపున పోరాటంలో పాల్గొన్నాయి. ఇదంతా నాణేనికి ఒక వైపు.. ఇక మరో వైపు చూస్తే సరిహద్దు వివాదం ఉంది. 1896లో బ్రిటిష్ వారు నిర్దారించిన డ్యూరాండ్ రేఖ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. అందుకే ఇక్కడ కంచె నిర్మించకుండా అఫ్గానిస్థాన్ అడ్డుకొంటోంది. తాలిబన్లలోని ప్రధాన తెగ అయిన పష్తున్‌లు పాక్‌లోని క్వెట్టా,పెషావర్ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో లక్షల సంఖ్యలో శరణార్థులు, ఉగ్రవాదులు అఫ్గాన్ నుంచి ఇక్కడకు చేరుతారనే భయాలు ఉన్నాయి. ఉగ్రవాదులు చైనా బీఆర్‌ఐ ప్రాజెక్టుకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని అనుమానిస్తోంది. అసలే దేశ ఆర్థిక పరిస్థితి మునిగిపోయే నావను తలపిస్తోంది. అందుకే 2,640 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఈ ఏడాది ఇనుప కంచె నిర్మించింది. దీనిలో సరిహద్దు పొడవునా 2 మీటర్ల వెడల్పున్న ఫెన్సింగ్ చుట్టను మధ్య వేశారు. ఈ కంచె పాక్ వైపు 3.6 మీటర్ల ఎత్తు.. అఫ్గాన్ వైపు 4 మీటర్ల ఎత్తు ఉంది. సరిహద్దు వెంట 1000 చెక్‌పోస్టులు, ఇన్ఫ్రారెడ్ నిఘా కెమేరాలను అమర్చింది. కేవలం 16 ప్రదేశాల నుంచి సరిహద్దులు దాటే ప్రవేశం కల్పించింది.
వేచి చూడాల్సిందే..
పాక్ ఆక్రమిత భారత భూభాగానికి అఫ్గాన్‌తో సరిహద్దులు ఉన్నాయి. అఫ్గాన్ పౌర ప్రభుత్వంతో భారత్ మంచి సంబంధాలను నెలకొల్పుకొంది. కానీ, తాలిబన్లు మాత్రం మొదటి నుంచి భారత్ వ్యతిరేకులు. దీంతో పాక్, చైనాలకు అఫ్గానిస్థాన్లో పలుకుబడి పెరుగుతుంది. భారత్ అఫ్గాన్‌లోని దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది. తమ భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా వాడుకోనీయమని తాలిబన్లు చెబుతున్నా.. గత చరిత్ర చూస్తే దీనిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. భారతీయులు అఫ్గాన్ వీడి వచ్చేయాలని ప్రభుత్వం అడ్వైజరీ కూడా జారీ చేసింది. నిన్న కాబుల్ నుంచి దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించింది.
డ్రాగన్‌కు షింజియాంగ్‌పై మనసులో ఆందోళన..
తాలిబన్ల ఆక్రమణ విషయం నిర్ధారణ కాగానే అమెరికా, యూకే,భారత్ వలే చైనా దౌత్యవేత్తలను తరలించలేదు. కానీ, సిబ్బంది సంఖ్యను మాత్రం గణనీయంగా తగ్గించింది. కాబుల్ ఎంబసీని తెరిచే ఉంచింది. అఫ్గాన్‌లోని చైనా వాసులు ఇళ్లుదాటి బయటకు రావద్దని హెచ్చరించింది. గత నెల తాలిబన్ నాయకులు చైనా పర్యటించి విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా ప్రాజెక్టులపై దాడులు జరగకుండా చూడాలని.. వీఘర్ ముస్లింలకు ఆశ్రయం ఇవ్వొద్దని కోరింది.
తాలిబన్లు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చైనా సెక్యూరిటీ నిపుణులు ఆ దేశ పార్లమెంటరీ ఆఫీసర్లను హెచ్చరించారు. దాదాపు 400 మంది చైనా వేర్పాటు వాదులు తేలిక పాటి, భారీ ఆయుధాల వినియోగంపై తాలిబన్ల వద్ద శిక్షణ పొందినట్లు చైనీస్ పోలీస్ అకాడమీకి చెందిన వాంగ్ యానింగ్ నివేదిక ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. తాలిబన్లే వారికి ఆయుధాలు ఇచ్చినట్లు ఆమె నివేదికలో పేర్కొంది. తాలిబన్లను పైకి ప్రదర్శించే మృదుత్వాన్ని చైనా ఏమాత్రం నమ్మలేని పరిస్థితి ఉందని ఈ నివేదిక చెబుతోంది.