లెబనాన్ రాజధాని బీరుట్ భారీ పేలుళ్లకు వణికిపోయింది. తొలుత ఏదైనా దాడి జరిగిందా? అనే కోణంలోనూ అనుమానించారు. కానీ, ఈ పేలుళ్లకు అమ్మోనియం నైట్రేట్ కారణమని తాజాగా లెబనాన్ అధికారులు ప్రకటించారు. ఓ గోదాములో నిల్వ ఉంచిన భారీ రసాయనాల కారణంగానే ఇంతటి పేలుళ్లు సంభవించాయని వెల్లడించారు.
నగరంలోని ఓడరేవు గోదాములో నిల్వఉంచిన 2700టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఈ పేలుళ్లకు కారణమని అధికారులు తేల్చారు. గత ఆరు సంవత్సరాలుగా భారీ రసాయనాలను గోదాములోనే ఉంచినట్లు గుర్తించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ స్థాయిలో రసాయనాలను నిల్వ ఉంచడం బాధ్యతారాహిత్యమని లెబనాన్ ప్రధాని హసాన్ దియాబ్ అన్నారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనం వహించమని, కారణమైనవారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.