ఓవైపు భారత్, చైనా వంటి దేశాలు వర్షాలతో విలవిలలాడుతుంటే.. ప్రపంచంలోని పలు దేశాలను వరుణుడు ఎన్నో ఏళ్లుగా కనికరించడంలేదు. ఇందులో దుబాయ్ ముందు వరుసలో ఉంటుంది. 50డిగ్రీల ఉష్ణోగ్రతతో దుబాయ్‌వాసులు భానుడి భగభగలు తట్టుకోలేకపోతున్నారు. ఎండలతో విసిగిపోయిన అక్కడి ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టును చేపట్టింది. వరుణుడు కనికరించకపోయినా వర్షాన్ని నేలకు తీసుకొచ్చే పనిలో పడింది. ఇందుకు క్లౌడ్ సీడింగ్ అని పిలిచే రెయిన్ మేకింగ్ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. దీని తాలూకూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
క్లౌడ్ సీడింగ్ అంటే?
క్లౌడ్ సీడింగ్ అనేది డ్రోన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఆకాశం మేఘావృతం అయినప్పుడు డ్రోన్లను మేఘాల మధ్యకు పంపుతారు. వాటి ద్వారా విద్యుత్ షాక్ ఇస్తారు. ఇలా చేయడం ద్వారా అవి కలిసిపోయి వర్షం సృష్టించడానికి ప్రేరేపిస్తాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి ఇంగ్లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ అంబామ్ నేతృత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 15 మిలియన్ డాలర్లును అక్కడి ప్రభుత్వం ఖర్చు చేసింది.