ఉత్తర ఇజ్రాయెల్‌లో యూదుల పవిత్రస్థలమైన.. మౌంట్‌మెరోన్ వద్ద నిర్వహిస్తున్న మతపరమైన సామూహిక ప్రార్థనల వేళ జరిగిన తొక్కిసలాటలో 40 మంది మరణించారు. యూదుల పండగ లాగ్ బౌమర్‌ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటి యూదు మతగురువు రబ్బి షిమోన్ బర్ యోచై సమాధి ఇక్కడే ఉండగా ఆయనకు నివాళులు అర్పించేందుకు, యూదులు ఈ పర్వదినాన వస్తారు. కరోనా ఆంక్షల సడలింపులు తర్వాత జరిగిన ఈ వేడుకలకు వేలాది మంది యూదులు హాజరయ్యారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకొని 40 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ విపత్తు నిర్వహణ సంస్థ మాగెన్ డేవిడ్ ఆడమ్ తెలిపింది. ఇంకా 150 మందికిపైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరగొచ్చని చెప్పింది.
ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు పదుల సంఖ్యలో అంబులెన్సులతో పాటు ఆరు హెలికాప్టర్లను కూడా వినియోగించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.. ఈ ఘటనను అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు. బాధితుల పక్షాన ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని ఆయన సూచించారు.
అర్ధరాత్రి తర్వాత
అర్ధరాత్రి తర్వాత ఈ దుర్ఘటన జరిగింది. అయితే కారణం ఏంటన్నది తెలియ రాలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో యూదులు ఒకే చోట వేలాదిగా గుమిగూడినట్లు కనిపిస్తోంది. అక్కడికి వచ్చిన వేలాది మంది ఒక మూలకు తోసుకు వచ్చారంటూ ఈ ఘటనలో గాయపడ్డ 24 ఏళ్ల ద్విర్ అనే యువకుడు ఇజ్రాయెల్ సైన్యానికి సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉన్న వారు కింద పడి పోయారని చెప్పాడు. తర్వాత రెండో వరుసలో ఉన్న తనతోపాటు అందరూ వారిపై పడ్డారని.. తమపై వెనుకవాళ్లు నెట్టుకుంటూ వచ్చి పడిపోయారని చెప్పాడు. తాను మరణం అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు వివరించాడు.
ఈ వేడుకకు దాదాపు లక్ష మంది వరకూ యూదులు హాజరై ఉంటారని టైమ్స్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపింది. రాత్రంతా ప్రార్థనలు, బాణసంచా వెలుగులు, నృత్యాలతో గడిపారు. అర్ధరాత్రి తర్వాత అందరూ మరోసారి ప్రార్థనలకు వెళ్తున్న సమయంలో మెట్లమార్గంలో కొందరు జారిపడ్డారని.. అది తొక్కిసలాటకు దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా ఇజ్రాయెల్ పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఈ కార్యక్రమం కోసం దాదాపు 5 వేల మంది పోలీసులు బందోబస్తుగా వచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ దుర్ఘటన జరగడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.