అర్ధ శతాబ్దం పాటు ఒమన్‌ను పాలించిన సుల్తాన్ కబూస్ 79 ఏళ్ల వయసులో మరణించారని ఒమన్ రాజ సంస్థానం వెల్లడించింది. ఒమనీ సుల్తాన్ కొంతకాలంగా పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న వదంతులు ఉన్నాయి. సుల్తాన్ మరణంపై రాజ ప్రాసాదం తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. అరబ్‌లో ఓ దేశాన్ని ఎక్కువకాలం పాలించిన వ్యక్తిగా కబూస్ గుర్తింపు పొందారు.
తర్వాత వారసుడు ఎవరు?
1970లో తిరుగుబాటుతో తన తండ్రి పదవీచ్యుతుడైన తర్వాత కబూస్ సుల్తాన్‌గా పట్టాభిషక్తుడయ్యారు. ఒమన్ సుల్తాన్ కబూస్ అవివాహితుడు. ఆయనకు సోదరులు కూడా లేరు. ఒమన్ సుల్తాన్‌కు వారసుడు లేకపోవడం వల్ల తదుపరి సుల్తాన్‌ను ఎన్నుకునేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారు. ఒమన్ రాజ్యాంగం ప్రకారం సింహాసనం ఖాళీగా ఉన్న మూడు రోజుల్లో రాజ కుటుంబం నూతన వారసుడిని ప్రకటిస్తుంది. కుటుంబం ఏకాభిప్రాయానికి రాకపోతే రాజ కుటుంబాన్ని ఉద్దేశించి కబూస్ రాసిన లేఖలో ఉన్న వ్యక్తి వారసుడు తదుపరి సుల్తాన్ అవుతాడు.