సిరియా నుంచి అమెరికా సేనలు వైదొలిగిన తర్వాత సిరియా కుర్దు దళాలే లక్ష్యంగా చేపట్టిన సైనిక చర్యను 5 రోజుల పాటు నిలిపివేసేందుకు టర్కీ అంగీకరించింది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్.. టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్‌తో అంకారాలో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది.
సిరియాలో సైనికుల చర్యలు నిలిపుదల: టర్కీ దాదాపు 4 గంటలు జరిగిన చర్చల్లో.. 5 రోజులు కాల్పుల విరమణ పాటించేందుకు ఎర్దోగాన్ సమ్మతించారు. ఈ లోపు టర్కీ సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల పరిధిని భద్రతా జోన్‌గా పరిగణిస్తూ సిరియా కుర్దు దళాలు.. ఖాళీ చేయాల్సి ఉంటుంది.
కుర్దు సేనల సాయంతోనే సిరియాలో వేళ్లూనుకున్న.. ఐఎస్ మూకలపై అమెరికా పోరాడింది. ఐతే సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత టర్కీ... కుర్దు దళాలపై భీకర దాడికి దిగింది. ఈ నేపథ్యంలో తమ మిత్రుల కోసం రంగంలోకి దిగిన అమెరికా.. కాల్పుల విరమణకు టర్కీని ఒప్పించింది.
తాము సైనిక చర్యను ఐదు రోజులు నిలిపివేసినట్లు ప్రకటించిన టర్కీ తమ సేనలను ఉపసంహరించుకోవట్లేదని తెలిపింది. కుర్దు దళాలు... భద్రతా జోన్‌నుంచి వైదొలగాల్సిందేనని స్పష్టంచేసింది. కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని కుర్దు దళాలు కూడా ప్రకటించాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదొక గొప్పరోజుగా అభివర్ణించారు ట్రంప్. అసాధారణమైన ఒప్పందంలో పాలు పంచుకున్నందుకు గర్వ పడుతున్నానని అన్నారు. ఇదీ చూడండి: 'ప్రపంచంలో 82 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు'