పాక్ ఉగ్ర ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం నిప్పులు చెరిగారు. ఇక్కడ జరిగిన 18వ అలీనోద్యమ దేశాల సదస్సులో మాట్లాడుతూ పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. భారతదేశంలో అస్థిరతను, అశాంతిని రెచ్చగొట్టేందుకు కుటిల యత్నాలు చేస్తోందన్నారు. సమకాలీన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు... బాన్‌డుంగ్(ఇండోనేషియా) సూత్రాల అమలు నేపథ్యంపై ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఉన్మాదం, వాతావరణ మార్పులు, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, సైబర్ నేరాలు ఎడాపెడా విస్తరిస్తున్న నేపథ్యంలో అలీన దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేయాలన్నారు.
మా పొరుగుదేశం తీరు చూడండి!
ఈ సదస్సులో అన్ని దేశాలు అభివృద్ధి, పరస్పర సహకారంపై మాట్లాడుతుంటే ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న పాకిస్థాన్ మాత్రం తన చర్యలను సమర్థించుకుంటున్న తీరును యావత్ ప్రపంచం గమనించాలని వెంకయ్యనాయుడు కోరారు. ఉగ్రసంస్థలు సమకూర్చుకుంటున్న సైబర్ సాంకేతిక సామర్థ్యం మన సమాచార సాంకేతికతకే పెనుముప్పుగా పరిణమించిందన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సభ్య దేశాలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత చట్టాలను మరింత పటిష్ఠం చేయడం, నిఘా బృందాల సమన్వయంపై 1996లో భారత్ చేసిన ప్రతిపాదనలను అనుసరించాలని కోరారు. శాంతి, అభివృద్ధి శక్తులతో కలిసి అలీనోద్యమం ముందుకు సాగే ప్రయత్నం చేయాలంటూ 130 కోట్ల భారతీయుల తరఫున కోరుతున్నామన్నారు. దురాక్రమణలకూ దూరంగా ఉండటం.. సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవడం, పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి 1955 నాటి బాన్‌డుంగ్ సదస్సు సూత్రాలు నేటికీ అనుసరణీయమేనన్నారు. అలీనోద్యమంలో భారతదేశం సర్వదా సమర్థ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ జనాభా ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్య, నిరుద్యోగ సంబంధ సమస్యలకు సత్వర పరిష్కారాలను అన్వేషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సు ప్రారంభానికి ముందు వియత్నాం ఉపాధ్యక్షురాలు డామ్ థీ ఎన్‌గోక్, క్యూబా ఉపాధ్యక్షుడు మిగుల్ బెర్ముడేజ్‌తో, అనంతరం అఫ్గాన్ ప్రతినిధులతో వెంకయ్యనాయుడు సారథ్యంలోని భారత బృందం ద్వైపాక్షిక చర్చలు జరిపింది.