ఇరాక్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రెండు రాకెట్ దాడులు జరిగాయి. మరో రాకెట్.. గ్రీన్ జోన్ పరిధికి సమీపంలోని ఓ నివాసంపై పడింది. ఇంటిలోని నలుగురికి గాయాలయ్యాయి.
ఇరాన్ అగ్ర కమాండర్ ఖాసీం సులేమానీ, ఇతర ఇరాక్ సైనిక బలగాలే లక్ష్యంగా అమెరికా డ్రోన్ దాడితో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ రాకెట్ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. గత రెండు నెలల్లో అమెరికా వ్యవస్థలే లక్ష్యంగా దాడులు జరగడం ఇది 14వ సారి.