ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తిస్తుంది. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం చూసుకుంటే.. అఫ్గాన్‌లో తాలిబన్లు(Afghanistan Taliban) ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో సగం మందిని బంధించాలేమో! ఎందుకంటే ఆ దేశ ప్రధాని సహా దాదాపు 14 మంది ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నిషేధిత జాబితాలోని వ్యక్తులే కావడం గమనార్హం. చాలామందిపై ఐరాస భద్రతా మండలి ఆంక్షలు ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా, హత్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు లాంటి హీనమైన చర్యలకు పాల్పడిన వారినే ఈ జాబితాలోకి ఐరాస చేరుస్తుంది. ప్రధానమంత్రి ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ (Mullah Hasan Akhund) నుంచి ప్రారంభిస్తే చివరకు ప్రావిన్స్ గవర్నర్ల కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు.
ఒకరిని మించి ఒకరు!
- గత తాలిబన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసి ఇప్పుడు ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ (Mullah Hasan Akhund).. తాలిబన్ వ్యవస్థాపకుడు మల్లా ఒమర్‌కు సన్నిహితుడు. ఐరాస ఆంక్షల జాబితాలో హసన్ ఎప్పటి నుంచో ఉన్నాడు
- ఉప ప్రధానిగా ఎంపికైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్(Abdul Ghani Baradar) చరిత్ర ఇంకా ఘోరం. ఈ మాజీ ఉగ్రవాదిని 2010లో అమెరికా బంధించి.. పాకిస్థాన్ జైలుకు తరలించింది. బరాదర్‌ను విడుదల చేయాల్సిందిగా 2018లో ట్రంప్ ప్రభుత్వం.. పాకిస్థాన్‌కు రహస్య సందేశం పంపింది. అలా బరాదర్ విడుదలై ఇప్పుడు ఉపప్రధానిగా గద్దెనెక్కాడు. మరో ఉప ప్రధాని అబ్దుల్ సలాం హనాఫీది కూడా హీనమైన చరిత్రే.
- ఎంతో కరడుగట్టిన ఉగ్రవాదైతేనే అమెరికా విదేశాంగ శాఖ లక్ష డాలర్లు బహుమతి ప్రకటిస్తుంది. తాలిబన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ ఆ కరడుగట్టిన జాబితాలోకి వస్తాడు. అఫ్గాన్ మాజీ ప్రధాని హమీద్ కర్జాయ్ హత్యాయత్నం సహా ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాల్లో నిందితుడు. మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సిరాజ్ మావయ్య ఖలీల్ హక్కానీ తలపై కూడా అమెరికా 50 లక్షల డాలర్ల బహుమతి ప్రకటించింది.
- ప్రపంచంలో కరడుగట్టిన ఉగ్రవాదులను అమెరికా గ్వాంటెనామో బే చెరసాలలో ఉంచేది. తాజా తాలిబన్ మంత్రివర్గంలో నలుగురు ఆ జైల్లో శిక్ష అనుభవించి వచ్చిన వారే. మహమ్మద్ ఫాజిల్, ఖైరుల్లా, ముల్లా నూరుల్లా నూరిలు గ్వాంటెనామో మాజీ ఖైదీలే. అఫ్గాన్ నిఘా అధిపతి ముల్లా అబ్దుల్ హక్ వాసిఖ్‌ది అదే చరిత్ర.
- రక్షణ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్, ఆయన సహాయకుడు మహ్మద్ అబ్బాస్‌లను ఐరాస భద్రతా మండలి 1988 ఆంక్షల కమిటీ ఉగ్రవాదులుగా పరిగణించి నిషేధం విధించింది. ఇందులో ముల్లా యాకూబ్.. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కొడుకు కావడం విశేషం.