ప్రజాస్వామ్యాన్ని తాలిబన్లు కాలరాసి, అఫ్గానిస్థాన్ అధికార పగ్గాల్ని లాక్కుంటున్న కీలక సమయంలో దేశం విడిచి పరారైన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రస్తుతం యూఏఈలో ఉన్నట్టు స్పష్టమైంది. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశ్రయం ఇచ్చినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తెలిపింది. అయితే ఘనీ ఎక్కడ ఉన్నారన్న విషయం కచ్చితంగా చెప్పలేదు.
అరెస్టు కోసం యత్నం
అంతకుముందు... అష్రఫ్ ఘనీ అరెస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు అఫ్గాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్. ఈమేరకు ఇంటర్‌పోల్‌ను తజకిస్థాన్‌లోని అఫ్గాన్ రాయబార కార్యాలయం కోరినట్టు వెల్లడించారు. మాతృభూమిని అమ్మేసిన వ్యక్తులను అరెస్టు చేసి, శిక్షించాల్సిందేనని ట్వీట్ చేశారు బిస్మిల్లా.