ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను వశం చేసుకున్నారు. రాజధాని నగరం కాబుల్ కూడా వారి పరమైందని తెలిసిన వెంటనే అక్కడి ప్రజలు దేశం వీడేందుకు విమానాశ్రయాలకు పోటెత్తారు. స్వయానా అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీనే దేశం వీడటం ప్రజల్లో ఆందోళన(Afghanistan Crisis)పెంచింది. పోరాడతామని చెప్పిన ఆయన పలాయనం చిత్తగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధులన్నీ ఖాళీ అవడంతో తమ దగ్గర కొనేదెవరని దుకాణదారులు వాపోతున్నారు.
కొనేవారు లేరు..
కాబుల్‌లోని వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతం నిత్యం సందడిగా ఉంటుంది. అక్కడ అమెరికా, కెనడా సహా పలు దేశాలకు చెందిన దౌత్యకార్యాలయాలు కార్యకలాపాలు నిర్వహించేవి. దేశరాజధాని కాబుల్‌తో సహా ఆ దేశమంతా తాలిబాన్ల వశం కావడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా బోసిపోయింది. అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, తమ కుటుంబాలతో సహా స్వదేశాలకు బయలుదేరారు. విమానాల కోసం వేచిచూస్తున్నారు. దాంతో అక్కడ వ్యాపారం చేసుకునేవారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తాలిబన్ల ఆంక్షల భయంతో చాలా దుకాణాలు మూతపడ్డాయి. నిత్యం హడావుడిగా ఉండే ప్రాంతంలో.. ఇక తమ వస్తువులు కొనడానికి ఎవరు వస్తారా? అని కొందరు వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. 'ఖాళీగా ఉన్న ఈ వీధుల్ని చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. హడావుడిగా తిరిగే దౌత్యవేత్తల కాన్వాయ్‌లు ఇక కనిపించవు. నాతో మాట్లాడే స్నేహితులు వెళ్లిపోయారు. నేనిక్కడ రొట్టెలు కాల్చి అమ్ముతుంటాను. ఏదో కొద్ది మొత్తంలో సంపాదించుకునేవాడిని. ఇక్కడ పనిచేసే భద్రతా సిబ్బందిలో నాకు స్నేహితులుండేవారు. ఇప్పుడు వారంతా వెళ్లిపోయారు. అప్పటి నుంచి రొట్టెలు కొనడానికి నా దగ్గరకు ఒక్కరు కూడా రాలేదు. ఏవరైనా వస్తారనే ఆశతో ఆ పెనాన్ని వేడిగా ఉంచుతున్నా' అని గుల్ మహమ్మద్ హకీమ్ అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన తన గడ్డం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దాన్ని వేగంగా ఎలా పెంచాలనే దాని గురించే ఆలోచిస్తున్నారు.