ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా రాకెట్ దాడులు జరిగాయి. బాగ్దాద్‌లోని అత్యధిక భద్రత కలిగిన గ్రీన్ జోన్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో నాలుగు రాకెట్లతో దాడులు జరిగినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఇరాక్ కొత్త ప్రభుత్వంతో అమెరికా వ్యూహాత్మక చర్చలు జరుపుతున్న క్రమంలో రాకెట్ దాడులు జరగటం ఇది మూడోసారి అని పేర్కొన్నాయి.
ఈ దాడులకు ఇంకా ఎవరూ బాధ్యత వహించలేదు.. కానీ ఇరాన్ మద్దతున్న పారామిలిటరీ దళాలే ఈ దాడికి ఒడిగట్టినట్లు అమెరికా ఆరోపించింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.
అమెరికా బలగాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమి ప్రభుత్వానికి తాజా రాకెట్ దాడులు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో అలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు కధిమి.