Zaporizhzhia Attack : జపోరిజియాలో తమ నియంత్రణ పరిధిలోని ప్రాంతాలపై రష్యా శుక్రవారం చేపట్టిన భారీ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు."యుద్ధ క్షేత్రంలో ఎదురవుతున్న పరాభవాన్ని, మా సేనలు కనబరుస్తున్న సమర్థతను చూసి శత్రువు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే కోపంతో ఈరోజు విరుచుకుపడి, అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాడు. మేము కోల్పోయిన ప్రతి ప్రాణం విషయంలోనూ శత్రు దేశం సమాధానం చెప్పక తప్పదు. ఆ సమయం తప్పకుండా వస్తుంది. తాము రష్యాతో చర్చలకు సిద్ధమేనని, అయితే మరో అధ్యక్షుడితో మాత్రమే చర్చలు జరుపుతామని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే విషయమై దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాం. ఇందుకు నిర్ణయాత్మకంగా ముందడుగువేసి 'యాక్సెలెరేటెడ్ అప్లికేషన్'ను సమర్పిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
జాతీయ భద్రత, రక్షణ మండలిని అత్యవసరంగా సమావేశపరిచిన ఆయన.. తాజా పరిస్థితులపై వారితో సమాలోచనలు జరిపారు. యుద్ధారంభంలో తమపై ఆంక్షలకు దిగిన పశ్చిమ దేశాలు... ఇప్పుడు ఏకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయని పుతిన్ ఆరోపించారు. బాల్టిక్ సముద్రం మీదుగా జర్మనీకి తాము నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ 1, 2 గ్యాస్ పైపులైన్లను ఆ దేశాలు ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఈ ఆరోపణలను అమెరికా, పశ్చిమ దేశాలు తోసిపుచ్చాయి. సముద్రగర్భ పేలుళ్ల కారణంగానే ఈ పైప్‌లైన్ పగిలి, భారీగా మీథేన్ విడుదలవుతోందని పేర్కొన్నాయి.
రెఫరెండం చెల్లదు: ఐరాస
ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో రష్యా తుపాకులతో బెదిరించి, ప్రజాభిప్రాయం చేపట్టిందని... ఈ రెఫరెండం చెల్లదని ఐరాస ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ చర్యను ఖండించే తీర్మానంపై సర్వప్రతినిధి సభలో ఓటింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.