Zelensky G7 Summit: రష్యా దాడిని ఎదుర్కొనేలా తమ సైన్యానికి తక్షణం సాయాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. సంపన్న దేశాలను కోరారు. జర్మనీలోని ఎల్‌మావ్‌లో జరుగుతున్న జీ7 కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో ద్వారా ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన ఆయా దేశాల నేతలు.. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు హామీ ఇచ్చారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తాము ఇప్పుడు సంక్లిష్ట స్థితిలో ఉన్నామని జెలెన్‌స్కీ తెలిపారు. క్రెమ్లిన్‌తో చర్చలకు ఇది అనువైన సమయం కాదన్నారు. మొదట తాము బలమైన స్థితికి చేరాలని చెప్పారు. అలాంటి సమయం వచ్చినప్పుడే చర్చలకు సిద్ధపడతానని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఈ దిశగా తమకు ఆర్థిక, సైనిక తోడ్పాటు కావాలని చెప్పారు.
జెలెన్‌స్కీ ప్రసంగాన్ని ఆలకించిన జీ7 కూటమి దేశాల నేతలు.. ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంతకాలమైనా సరే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉక్రెయిన్ ప్రభుత్వమేనన్నారు. మరోవైపు తాజా శిఖరాగ్ర సదస్సులో ఉక్రెయిన్ అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. రష్యా దూకుడుకు కళ్లెం వేయడానికి ఈ దేశాల నేతలు పలు చర్యలకు సిద్ధమవుతున్నారు. రష్యన్ వస్తువుల దిగుమతులపై సుంకాలను పెంచనున్నారు. ఆ దేశ ఆయుధ సరఫరా వ్యవస్థలు లక్ష్యంగా కొత్తగా ఆంక్షలను విధించనున్నారు. నార్వే నుంచి 'నాసామ్స్' అనే విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసి, ఉక్రెయిన్‌కు అందించాలని అమెరికా భావిస్తోంది. జెలెన్‌స్కీ సేనకు శతఘ్ని గుళ్లను, రాడార్లను అందించనుంది.
సదస్సులో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ విషయంలో జీ7 దేశాల విధానాల్లో ఏకాభిప్రాయం ఉందని చెప్పారు. రష్యాపై కఠిన చర్యలు తీసుకుంటూనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉక్రెయిన్‌కు సాధ్యమైనంత సాయం అందిస్తామని తెలిపారు. రష్యాకు, నాటోకు మధ్య భారీ ఘర్షణ జరగకుండా చూస్తామన్నారు. ఉక్రెయిన్ తన ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మించుకునేందుకు సాయపడతామని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు. ఆత్మరక్షణకూ తోడ్పాటు అందిస్తామన్నారు. మారుతున్న పరిస్థితుల్లో తమ శీఘ్ర స్పందన దళాల సంఖ్యను 40వేల నుంచి 3 లక్షలకు పెంచుతామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.