Wagner Group Chief Dead : రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇటీవల తిరుగుబావుటా ఎగురవేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ దుర్మరణం చెందారు. ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ కుప్పకూలడం వల్ల (Prigozhin Plane Crash).. ఆయన చనిపోయారు. ప్రిగోజిన్ సహా అందులో ఉన్న మొత్తం 10 మంది మృతి చెందినట్లు.. రష్యా సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ తెలిపింది. మాస్కోకు దాదాపు 100 కిలో మీటర్లు దూరంలోని తెవర్ ప్రాంతంలో ప్రయాణికులతో కూడిన జెట్ కూలినట్లు వెల్లడించింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో.. ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
Prigozhin Wagner Death :మాస్కో నుంచి సెయింట్‌పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న ప్రైవేటు జెట్ కూలి.. మృతిచెందిన వారిలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కుప్పకూలిన జెట్ ప్రిగోజిన్ పేరున ఉన్నట్లు సమాచారం. అయితే, క్రెమ్లిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన దాదాపు రెండు నెలల లోపే ప్రిగోజిన్ దుర్మరణం పాలవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో పాటు రష్యా ఎయిర్ ఫోర్స్ కమాండర్ సెర్గీ సురోవికన్ను తొలగించినట్లు రష్యా మీడియా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రిగోజిన్ విమానం కుప్పకూలడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై.. ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది.