G20 Summit: ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చైనా.. జీ20 వేదికగా జరిపిన చర్చల వివరాలు బహిర్గతం కావడంపై కెనడాపై అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే? చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జీ20 సదస్సులో భాగంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాలు మీడియాలో రావడంపై ట్రూడో తీరుపట్ల జిన్‌పింగ్ తన అంసతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ కెనడా జర్నలిస్టు రికార్డు చేశారు.
జీ20 సదస్సులో కెనడా ప్రధానిపై జిన్‌పింగ్ అసహనం.. వీడియో వైరల్! - కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
జీ20 వేదికగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు పట్ల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
'మనం చర్చించిన విషయాలు మీడియాలో వచ్చాయి. ఇది సరైన పద్ధతికాదు. చర్చలు జరిపే విధానం ఇది కాదు' అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ..'కెనడాలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని మేం భావిస్తాం. దాన్నే మేం కొనసాగిస్తాం. కలిసి పనిచేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధం. కానీ, కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదు' అని ట్రూడో జిన్‌పింగ్‌కు బదులిచ్చినట్టుగా ఆ వీడియోలో రికార్డయింది. అనంతరం ఇరువురు నేతలు పరస్పరం కరచాలనం చేసుకుని ఎవరి దారిలో వారు వెళ్లిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. మూడేళ్ల అనంతరం చైనా అధ్యక్షుడు, కెనడా ప్రధాని మధ్య జీ20 సదస్సు వేదికగా చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగాలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలూ చర్చించినట్టు సమాచారం.