Worlds Most Loyal Employee: సాధారణంగా ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే వారు ఎంతకాలం పని చేస్తారు. ఏడాదో, ఐదేళ్లో.. మరీ నచ్చితే.. రిటైర్మెంట్ వరకు పని చేస్తారు. అయితే బ్రెజిల్‌కు ఓ వ్యక్తి మాత్రం.. గత 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. ఆయనే వాల్టర్ ఓర్త్‌మాన్. అత్యధిక కాలం ఒకే సంస్థలో పని చేసినందుకు గానూ.. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇటీవల ఆయన తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.
Walter Orthmann loyal employee: 1938 జనవరి 17 నుంచి వాల్టర్ ఓర్త్‌మాన్ బ్రస్క్‌లోని రెనాక్స్ ఎస్.ఏ అనే టెక్స్‌టైల్ కంపెనీలో పని చేస్తున్నారు. తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాల్టర్ ఈ సంస్థలో చేరారు. షిప్పింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ ఇలా పలు పదవుల్లో పని చేశారు. తన 84 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో వాణిజ్య పరంగా అనేక మార్పులను చూశారు. సేల్స్ మేనెజర్‌గా ఉన్నప్పుడు విదేశాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తొమ్మిది రకాల తొమ్మిది వేర్వేరు కరెన్సీ డినామినేషన్లలో లావాదేవీలు జరిపిన అనుభవం ఆయన సొంతం. బ్రెజిల్ విమానయాన చరిత్రలో దాదాపు అన్ని రకాల వాణిజ్య విమానయాన సంస్థలను వాల్టర్ వినియోగించడం గమనార్హం.
ఇన్ని దశాబ్దాలుగా పని చేయడానికి కారణం ఏంటని వాల్టర్‌ను అడిగినప్పుడు.. ' పని చేయడానికి ఇష్టపడాలి. నేను అదే స్ఫూర్తితో పని చేస్తున్నాను' అని చెప్పుకొచ్చారు వాల్టర్. ఫిబ్రవరి 2022 నాటికి రెనాక్స్ ఎస్.ఏ కంపెనీలో వాల్టర్ అనుభవం 84 సంవత్సరాల 9 రోజులు. ఇంతటి సుధీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న వాల్టర్.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి చోటు సంపాదించారు. ఏప్రిల్ 19న వాల్టర్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయినా ఆయన రిటైర్ అవ్వాలని అనుకోవడం లేదట.