ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. నవంబర్ 15 నాటికి భూమి మీద జన సంఖ్య 8 వందల కోట్లను దాటనుందని ఐరాస అంచనా. 48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గి.. ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. పెరుగుదల సరే.. మరి ఇంత భారీ జనాభా మున్ముందు సౌకర్యవంతంగా జీవించగలదా? ఆహార భద్రత మాటేమిటి? ఆరోగ్య సంరక్షణ ఎలా?.. ఇలాంటి సందేహాలెన్నో ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ప్రకృతి వనరులపై పడే భారం.. పెరిగే భూతాపం.. ఫలితంగా విరుచుకుపడే విపత్తులు, కరవులు, నీటి కొరత వంటి అంశాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మనుషులంతా సుస్థిరమైన లక్ష్యాలతో పుడమిని కాపాడుకునే ఉమ్మడి బాధ్యతను స్వీకరించాలని ఐరాస కోరుతోంది.
క్రీస్తు పూర్వం 8000 సంవత్సరం ప్రాంతంలో ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లు అని కూడా చెబుతున్నాయి.
ఎప్పటికి ఎంత పెరుగుదల?
1804 సంవత్సరంలో ప్రపంచంలో మానవుల సంఖ్య వంద కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా శిశువుల్లో ఇవి బాగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్ల స్థాయికి చేరుకోవడానికి 126 ఏళ్లు మాత్రమే పట్టింది. 300 కోట్ల మార్కుకు మరో 30 ఏళ్లు, 400 కోట్ల స్థాయికి 14 ఏళ్లు, 500 కోట్ల మార్కును తాకడానికి 13 ఏళ్లు పట్టింది. 600 కోట్ల స్థాయిని మాత్రం చాలా వేగంగా 11 సంవత్సరాల్లోనే మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల స్థాయిని తాకడానికి 12 ఏళ్లు పట్టింది. 800 కోట్ల మార్కుకూ ఇంతే సమయం అవసరమైంది.
- 20వ శతాబ్దంలోనే ప్రపంచ జనాభా 165 కోట్ల నుంచి 600 కోట్లకు పెరిగింది.
- అయితే పెరుగుదల రేటు తగ్గుతుండటం వల్ల ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి మరో 200 ఏళ్లు పట్టొచ్చు.
అడవుల నరికివేత..
గత 50 ఏళ్లలో మానవ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. అడవుల్లోని క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మాత్రం సరాసరిన మూడింట రెండొంతుల మేర తగ్గిపోయాయి. మన అవసరాల కోసం యథేచ్ఛగా వనాలను నరికేయడమే ఇందుకు కారణం. గత 60 ఏళ్లలో ప్రపంచ అటవీ విస్తీర్ణం 81.7 మిలియన్ హెక్టార్ల మేర తగ్గింది. మానవ చర్యల వల్ల భూమిపై మూడొంతుల ప్రాంతం, సాగరాల్లో రెండొంతులు భాగం మార్పులకు లోనైంది. పుడమిపై ఉన్న క్షీరదాల బయోమాస్‌లో మూడొంతుల వాటా మానవులదే. మిగిలినదాన్లో చాలా భాగాన్ని మనం పెంచుకుంటున్న పశువులు ఆక్రమించుకున్నాయి. మొత్తం క్షీరదాల్లో వన్యప్రాణుల వాటా 2 శాతమే కావడం గమనార్హం.
- మానవ చర్యల వల్ల 10 లక్షలకుపైగా జీవజాతులు అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుదలతో ఇది ఇంకా తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- జీవవైవిధ్యం తగ్గిపోవడం, వనరులపై భారం పడటం మానవాళి మనుగడకూ ముప్పే. పెరుగుతున్న జనాభాకు ఆహారం, తాగునీరు, ఆవాసం, వైద్యం అవసరం. ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే ఇది సాధ్యం.