World Military Expenditure: కరోనాతో ఆర్థిక వృద్ధి మందగించినా, అంతర్గతంగా ఎన్ని అవంతరాలు ఏర్పడినా.. ప్రపంచ దేశాలు సైనిక శక్తి బలోపేతానికి చేసే ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2021లో ప్రపంచ సైనిక వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే.. 0.7 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) నివేదిక వెల్లడించింది. 2021లో అన్ని దేశాలు సైన్యంపై 2.1 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయగా అందులో తొలి ఐదు దేశాలే 62 శాతం ఖర్చు చేశాయి. ఈ ఐదు దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో భారత్, నాలుగో స్థానంలో బ్రిటన్, ఐదో స్థానంలో రష్యా ఉన్నాయి.
కరోనా మహమ్మారి ధాటికి ఏర్పడ్డ ఆర్థిక పతనం తర్వాత కూడా.. ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలను తాకిందని సిప్రీ సీనియర్ పరిశోధకుడు డాక్టర్ డియెగో లోపెస్ తెలిపారు. కరోనా తర్వాత ఆర్థిక పునరుద్ధరణ ఫలితంగా.. దేశాల రక్షణ వ్యయం ప్రపంచ జీడీపీలో 2.2 శాతానికి చేరుకుందని వివరించారు. సిప్రీ నివేదికలోని మరిన్ని కీలకాంశాలు..
- 2021లో అమెరికా సైనిక వ్యయం 801 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- 2012-2021 మధ్య కాలంలో సైనిక పరిశోధన, అభివృద్ధి నిధులను 24 శాతం పెంచింది.
- అమెరికా ఆయుధాల కొనుగోళ్లపై ఖర్చును 6.4 శాతం తగ్గించింది.
- 2020తో పోల్చితే సైనిక ఖర్చును 4.7 శాతం చైనా పెంచింది.
- 293 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించి రెండో స్థానంలో నిలిచింది.
- గతేడాది భారత సైనిక వ్యయం 76.6 బిలియన్లకు చేరింది.
- ప్రపంచంలోని రక్షణ కోసం ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
- 2020తో పోలిస్తే భారత సైనిక వ్యయం 0.9 శాతం పెరిగింది.
- 2012 తో పోలిస్తే భారత సైనిక వ్యయం ఏకంగా 33 శాతం ఎగబాకింది.
- బ్రిటన్ 68.4 బిలియన్ డాలర్లను రక్షణ కోసం వెచ్చించి ప్రపంచంలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది.
- 2020తో పోలిస్తే బ్రిటన్ సైనిక వ్యయం మూడు శాతం పెరిగింది.