G 20 2022 Summit : ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు వ్యతిరేకత చూపుతున్నాయి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ జీ-20 సదస్సులో కూడా కనిపించనుంది. అందుకే వచ్చే వారం జరగనున్న సమావేశంలో ఫ్యామిలీ ఫొటో దిగొద్దని ప్రపంచ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సదస్సు మొదలుపెట్టే ముందు ఈ నేతలంతా ఒకదగ్గర నిల్చొని ఫొటోకు పోజు ఇస్తారు. అయితే ఈసారి అది మిస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రష్యా చేపడుతోన్న ప్రత్యేక ఆపరేషన్‌పై వస్తోన్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదని ఇప్పటికే ప్రకటన వెలువడింది. అయితే ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతున్నారు. ఈ యుద్ధం సమయంలోనే ఇదివరకు జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ ఆహార సంక్షోభానికి ఈ దాడి కారణం కాదని లావ్రోవ్ వాదించారు. ఆ మాట చెప్పి మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే.. ఈ సదస్సులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వర్చువల్‌గా ప్రసంగించాలని కోరగా.. పుతిన్ వస్తే, తాను ఇందులో భాగంకానని ఆయన వెల్లడించారు. అలాగే రష్యా జీ-20లో భాగంగా ఉంటే, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రావడం వీలుకాకపోవచ్చని బ్రిటన్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ-20 పాలనా పగ్గాలను డిసెంబరు 1న ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించనుంది.