World Hottest Day 2023 : జులై 3 తేదీన భూమిపైనే అత్యంత వేడి రోజుగా రికార్డ్ నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ వెల్లడించింది. జులై 3 తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని తెలిపింది. ఈ వివరాలు మైనే యూనివర్సిటీ అధ్యయనంలో తెలిసినట్లు చెప్పింది. ఫలితంగా 2022 జులై, 2016 ఆగస్టులో నమోదైన 62.46 డిగ్రీల ఫారెన్‌హీట్ రికార్డు బద్దలైందని వివరించింది. వాయవ్య కెనడా, పెరూ, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.
"యూఎస్ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్రిడిక్షన్ ప్రకారం.. సోమవారం ప్రపంచంలోనే అత్యంత వేడి రోజు. ఇప్పటివరకు మనుషులు లెక్కకట్టిన వాటిలో ఇదే అత్యధికం. ఎల్‌నినోతో పాటు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇలా జరిగింది. గత ఆరు వారాలుగా పరిశీలిస్తే.. ఇలాంటి అత్యధిక ఉష్ణోగ్రత గల రోజులు చాలా ఉన్నాయి."
--రాబర్ట్ రోహ్డే, కాలిఫోర్నియా యూనివర్సిటీ
ఎల్ నినో అంటే తెలుసా?
పసిఫిక్ మహా సముద్రంలో వేడి నీటి పరిస్థితులను తొలిసారిగా 16వ శతాబ్దంలో పెరూ, ఈక్వెడార్ తీరప్రాంత జాలరులు గుర్తించారు. సముద్రపు నీరు వేడెక్కినప్పుడు చేపలు తక్కువగా పడుతున్నట్టు, ఇది క్రిస్‌మస్ సమయంలో ఎక్కువగా ఉంటున్నట్టు గమనించారు. దీనికి వారు పెట్టుకున్న పేరు 'ఎల్‌నినో డి లా నేవిడాడ్'. అంటే 'ద క్రిస్‌మస్ చైల్డ్'.. అనగా బాల ఏసు అని అర్థం. ఆ తర్వాత 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో శాస్త్రవేత్తలు వివిధ దేశాల్లో సంభవిస్తున్న మార్పులకు కారణమేంటనేది తెలుసుకోవటం మీద దృష్టి సారించారు. చివరకు ఇవి ఆయా ప్రాంతాలతో ముడిపడినవి కావని.. ఎల్‌నినో ప్రభావంతోనే ఏర్పడుతున్నాయని 20వ శతాబ్దంలో గుర్తించారు. ఇది సగటున 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుందని తెలుసుకున్నారు. అయితే ఇదేమీ కచ్చితమైన వ్యవధి కాదు. కొన్నిసార్లు రెండేళ్లకూ, మరికొన్ని సార్లు 7 సంవత్సరాలకూ ఏర్పడొచ్చు. సాధారణంగా ఇది 9-12 నెలల పాటు కొనసాగుతుంది. కానీ కొన్నిసార్లు ఏళ్ల కొద్దీ ఉండొచ్చు.
ఇవీ చదవండి :ఏడాది మొత్తంలో ఈరోజే షార్టెస్ట్ డే.. ఎందుకో తెలుసా?
2023లో 'నేడు' సో స్పెషల్.. పగలు ఎక్కువ.. రాత్రి తక్కువ.. ఎందుకలా?