కొవిడ్-19 మహమ్మారితో వణికిపోయిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడిప్పుడే దాని ప్రభావం నుంచి బయటపడుతున్నాయి. ఇదే సమయంలో వైరస్‌ల వ్యాప్తి కట్టడిపై పలు దేశాలు అలసత్వం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రకాల వైరస్‌లు, వ్యాధికారకాలు ప్రస్తుతం అత్యధిక వేగంతో వ్యాపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా కొవిడ్-19, ఫ్లూతోపాటు ఇతర వ్యాధి కారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని.. పౌరులు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించింది.
"జాగ్రత్తగా ఉండండి. కొవిడ్-19, ఫ్లూ, శ్వాసకోశ వ్యాధి వైరస్లతోపాటు ఇతర వ్యాధికారకాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మీరు, మీ సన్నిహితులు సురక్షితంగా ఉండేందుకు ఉన్న అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్‌లు తీసుకోవడం, మాస్కులు, భౌతిక దూరం, వెంటిలేషన్, స్వీయ పరీక్షలు, అనారోగ్యం బారిన పడితే ఇంటి దగ్గరే ఉండటం, చేతులు శుభ్రపరచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముప్పును ముందే తెలుసుకోవడం ద్వారా వాటి తీవ్రతను తగ్గించవచ్చు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వాన్ కేర్ఖోవ్ స్పష్టం చేశారు.