World Culture Festival 2023 :ప్రపంచసాంస్కృతిక ఉత్సవాలు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో 180 దేశాల నుంచి 17 వేల మంది కళాకారులు పాల్గొంటున్నారు. రెండో రోజూ సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. లింకన్ సెంటర్ వద్ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపన్, యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, ట్యునీషియా మాజీ అధ్యక్షుడు మోన్‌సెఫ్ మార్జౌకీ తదితరులు తమ సందేశం వినిపించారు.
రెండో రోజు ప్రఖ్యాత కళాకారుల సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమెరికా ఆర్మీ బ్యాండ్, చైనీస్ కల్చరల్ ఆర్టిస్టులు, గార్బా నృత్యాలు, పశ్చిమ దేశాల నృత్యాలు, ఉక్రెయిన్ కళాకారుల ప్రదర్శన అలరించాయి. ప్రపంచ సాంస్కృతిక వేడుకల్లో రెండో రోజున ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ వీక్షకులతో మెడిటేషన్ చేశారు.ఈ సందర్భంగా మెడిటేషన్ ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ సందర్భంగా జయహో నినాదాలతో వాషింగ్టన్ డీసీ ప్రాంతం మార్మోగిపోయింది.
"శబ్దం తన సంగీతంతో విస్తరిస్తుంది. కదలికలు ఒక పద్ధతిలో విస్తరించి నృత్యంగా మారతాయి. మెడిటేషన్‌తోనే మనసు విస్తరిస్తుంది. సంబరాలతోనే జీవితం విస్తరిస్తుంది. అన్ని రకాల శబ్దం అంతరంగంలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. నిశ్శబ్దం సృజనాత్మకతకు అమ్మలాంటిది. అది ప్రేమ, కరుణతో నిండిన ఇల్లు వంటిది. మనలోని నిశ్శబ్దం నిజమైన ఆనందం, సంతోషం, ప్రేమను వికసింపజేస్తుంది. కాబట్టి కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్ అనేది ఏ ప్రయత్నమూ లేకుండా చేసేది. దానికి ప్రయత్నం అవసరమే లేదు.