World Cultural Festival 2023 :అమెరికా రాజధాని వాషింగ్టన్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచం నలుమూల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ వేడుక కోసం అమెరికా కేపిటల్ భవంతి నుంచి జాతీయ స్మారకం నడుమ ఉన్న ప్రాంతమంతా జన సందోహంతో కిక్కిరిసిపోయింది. అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సమయంలో తప్పిస్తే ఇంతమంది రావడం అరుదు. కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరై ఉంటారని నిర్వాహకులు అంచనా వేశారు. సవాళ్లను వాస్తవిక దృక్పథంతో స్వీకరించి, మెరుగైన భవితకు బాటలు వేసుకోవాలని శ్రీశ్రీ రవిశంకర్ తన ప్రసంగంలో సూచించారు.
"మానవాళి మంచితనంపై మనకున్న విశ్వాసాన్ని పునరుద్ఘాటిద్దాం. సమాజంలో చాలావరకు మంచి ఉంది. మంచి చేయాలనే తపన ఉంది. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించేలా కలలు కందాం. మరింత ఆనందాన్ని తీసుకువచ్చేందుకు, సమాజాన్ని ఆనందమయం చేసేందుకు పాటుపడదాం. ఎక్కువమంది ముఖాల్లో చిరునవ్వులు విరబూసేలా చూద్దాం. మనమంతా ఒక్కటే. దానిని గుర్తించడంలోనే మన జ్ఞానం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ మానవాళి అంతా ఒకే కుటుంబం. మన జీవితాలను ఆస్వాదిద్దాం"
- శ్రీశ్రీ రవిశంకర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
Art Of Living World Culture Festival 2023 : వాతావరణ మార్పులు, ఆర్థిక పురోగతి వంటి సవాళ్లను ఏ దేశానికి ఆ దేశం విడిగా పరిష్కరించుకోలేవని.. ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ తరహాలో లక్షల మంది హాజరైన వేడుక ద్వారా శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలో ప్రపంచమంతా ఒక్కచోటుకు చేరిందని చెప్పారు.
మానవత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకం చేసే ఉద్దేశంతో రూపొందించిన సాంస్కృతిక కుంభమేళాగా ప్రఖ్యాతి గాంచిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాల నుంచి 17 వేల మంది కళాకారులు తరలివచ్చారు. వీరిలో ప్రఖ్యాత కళాకారులు, గ్రామీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. కన్నుల పండువగా, వీనులవిందుగా జరిగిన మొదటిరోజు కార్యక్రమాల్లో గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారులు కలిసి 'అమెరికా ది బ్యూటిఫుల్' అనే ప్రదర్శనను ఇచ్చారు. భారతదేశానికి చెందిన వెయ్యిమంది కళాకారుల బృందం "పంచ భూతం" ప్రదర్శనను ఇచ్చింది.
సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలు
సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలు
సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలు
సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యాలు