Woman Swims To India For Lover: ప్రేమ.. ఓ మధురమైన భావన. అందుకోసం రాజ్యాలు కోల్పోయిన వారు.. యుద్ధాలు చేసిన వారి గురించి మనం వినే ఉంటాం, చదివే ఉంటాం. అయితే కల్మషం లేని ప్రేమ మాత్రం ప్రేమికులతో ఎంతటి కష్టమైన పనైనా చేయిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తుడిపేస్తుంది. ఈ విషయాన్ని మరోమారు నిరూపించింది బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి. ఆమె చేసిన సాహసం తెలిస్తే హ్యాట్సాఫ్ అనక మానరు. ఫేస్‌బుక్ ప్రేమే అయినా ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ఆమె పడిన తపన, చేసిన సాహసం మాత్రం తెలిస్తే ఔరా అనిపిస్తుంది.
కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ అనే యువకుడితో బంగ్లాదేశ్ యువతి కృష్ణ మండల్‌కు కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. భారత్‌కు వచ్చి అతడితో మూడుముళ్లు వేయించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాయల్ బంగాల్ పులులు ఉండే సుందర్‌బన్ అడవిని దాటేసింది. ఆ తర్వాత సముద్రంలోకి దూకి గంటపాటు ఈదుకుంటూ బంగాల్లో అడుగుపెట్టింది. మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీమాత ఆలయంలో ప్రియుడు అభిక్ మండల్‌తో మూడుముళ్లు వేయించుకుంది. ఇక్కడితో వీరి ప్రేమ కథ సుఖాంతం అవ్వలేదు. ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకున్నాననే ఆనందంలో ఉన్న ఆమెకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ పెళ్లి మాటలు ఆ నోట ఈ నోట తిరిగి పోలీసుల చెవిలో పడ్డాయి. వెంటనే అసలు విషయం తెలుసుకున్న పోలీసులు.. కృష్ణ మండల్ భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె చేసిన సాహసాలు తెలిసి షాకయ్యారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి అప్పగించాలని నిర్ణయించారు.