Switzerland Bans EVs : స్విట్జర్లాండ్ దేశం ఎలక్ట్రిక్ వాహనాలను నిషేధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ దేశం తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. కరెంట్ వినియోగాన్ని తగ్గించేందుకు అధికారులు ఈ ప్రతిపాదన రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. ఈవీలపై నిషేధం విధించిన మొదటి దేశం స్విట్జర్లాండ్ కానుంది.
ఆ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు నిషేధం!.. కారణం ఇదే..
స్విట్జర్లాండ్‌ను విద్యుత్ సంక్షోభం తీవ్రంగా పట్టిపీడిస్తోంది. ఈ కారణంగా ఆ దేశ అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలను నిషేధించే ప్రతిపాదనను రూపొందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలు చేస్తే.. అలా చేసిన మొదటి దేశం స్విట్జర్లాండ్ అవుతుంది.
స్విట్జర్లాండ్ విద్యుత్ అవసరాలకు ఎక్కువగా జలవిద్యుత్‌పైనే ఆధారపడి ఉంది. ఆ దేశ విద్యుత్‌లో దాదాపు 60 శాతం మేర నీటి నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే, శీతాకాలంలో మాత్రం ఉత్పత్తి కాస్త తగ్గుతోంది. అందుకే.. విద్యుత్ అవసరాల కోసం పొరుగునే ఉన్న ఫ్రాన్స్, జర్మనీ నుంచి కూడా విద్యుత్తును కొనుక్కుంటోంది స్విట్జర్లాండ్. అయితే ఈ రెండూ దేశాలు కూడా ప్రస్తుతం రష్యా విధించిన ఆంక్షల వల్ల ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా ఆయా దేశాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న స్విట్జర్లాండ్పైనా తీవ్ర ప్రభావం పడింది.
విద్యుత్ కొరత ఇలానే కొనసాగితే.. మొత్తం పవర్ గ్రిడ్ కుప్పకూలే ప్రమాదముంది. అదే జరిగితే ఆ దేశం మొత్తం అంధకారం నెలకొంటుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది స్విట్జర్లాండ్. ఎక్కడికక్కడ విద్యుత్ పొదుపునకు ప్రయత్నిస్తోంది. థియేటర్ ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలను కూడా నిషేధించాలని చూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని అవసరమైన ప్రయాణాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. క్రిప్టోకరెన్సీ మైనింగ్, ఎస్కలేటర్‌ల వాడకంపైనా నిషేధం విధించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భావిస్తోంది.