Booster dose WHO: కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే బూస్టర్ డోసులు తీసుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ప్రతి 4-6 నెలలకు కొత్త వేవ్‌లు పుట్టుకొస్తున్న తరుణంలో బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బలహీనంగా ఉన్నవారికి మూడో డోసు అనివార్యమన్నారు. 'తగ్గుతున్న రోగనిరోధకశక్తిని పెంచుకోడానికి, ముఖ్యంగా బలహీనంగా ఉన్నవారు బూస్టర్ షాట్ తీసుకోవడం తప్పనిసరి' అని అన్నారు.
'4-6 నెలలకు కొత్త వేవ్‌లు.. బూస్టర్ డోసులు తప్పనిసరి'
Booster dose WHO: ప్రతి 4-6 నెలలకు కొత్త వేవ్‌లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రముఖ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే బూస్టర్ డోసులు తీసుకోవాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు బూస్టర్ డోసులు తీసుకోవాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించగా.. బలమైన దీర్ఘకాలిక రోగనిరోధకశక్తి కోసం మూడు డోసులు వేసుకోవాలని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో మళ్లీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇందుకు అనేక కారణాలున్నాయని స్వామినాథన్ పేర్కొన్నారు. ఇమ్యూనిటీ తగ్గిపోతుండటంతో పాటు.. అధిక వ్యాప్తి కలిగిన బీఏ.4, బీఏ.5 ఒమిక్రాన్ ఉపవేరియంట్లు వ్యాపిస్తున్నాయన్నారు. కేసుల పెరుగుదలకు 'ప్రజల ప్రవర్తన' మరో ముఖ్య కారణమని.. మాస్కులు లేకుండానే ప్రజలు విచ్చవిడిగా తిరుగుతూ గుమిగూడుతున్నారని తెలిపారు. మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు.
భారత్‌లో మూడు డోసులు తీసుకున్నవారి సంఖ్య తక్కువే. బూస్టర్ డోసు ఇచ్చేందుకు 60 ఏళ్లు పైబడిన వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వగా.. వారిలో ఇప్పటివరకు 15శాతం మంది మాత్రమే తీసుకున్నారు. 18-59 ఏళ్లలోపు వారు కేవలం 1శాతం మంది మాత్రమే మూడో డోసు వేసుకున్నారు.
ఇదీ చదవండి: 'మహా'లో 10రోజుల్లోనే 241% కేసుల పెరుగుదల.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక