WHO Monkeypox: ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వందలాది మంకీపాక్స్ కేసులు మరో మహమ్మారికి దారి తీసే అవకాశంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే ఈ వ్యాధి గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయం సహా దశాబ్దాల కిందే మశూచి టీకాల కార్యక్రమాన్ని నిలిపివేయడం వల్ల ఇది వేగంగా సంక్రమించడానికి వీలవుతుందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.
ప్రపంచదేశాల్లో వెలుగుచూస్తున్న మంకీపాక్స్ కేసుల్లో అధిక శాతం స్వలింగ, ద్విలింగ సంపర్కులు, పురుషులతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న పురుషుల్లోనే అనేది నొక్కి చెప్పడం ముఖ్యమని డబ్ల్యూహెచ్ఓ డా.రోజమండ్ లూయిస్ సోమవారం ఓ సభలో అన్నారు. అప్పుడే దీనిపై శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయగలరగని, రిస్క్ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోగలరని చెప్పారు. అయితే లైంగిక ధోరణితో సంబంధంలేకుండా ఎవరికైనా వ్యాధి సోకే ప్రమాదముందని హెచ్చరించారు.
అయితే స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి బయటపడటం కేవలం యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చని, దీనిని అరికట్టకపోతే మిగిలినవారిలోనూ సంక్రమించే ప్రమాదముందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాధి సెక్స్ ద్వారా సంక్రమిస్తుందా లేదా రతిలో పాల్గొనే వ్యక్తులు కేవలం భౌతికంగా దగ్గరగా ఉండవల్ల సోకుతుందా అనేది తెలియాల్సి ఉందని లూయిస్ అన్నారు. ఇంకేమైనా కొత్త విధానంలో సంక్రమిస్తుందా అనేదీ తెలియాల్సి ఉంది.
వ్యాధిగ్రస్తులతో లేదా వారి దుస్తులు, బెడ్షీట్లతో దగ్గరగా ఉండేవారికి మంకీపాక్స్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుత కేసుల్లో ఎక్కువ శాతం మందిలో జననేంద్రియ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన కొన్ని గాయాలను గుర్తించినట్లు లూయిస్ తెలిపారు. అవి కొన్నిసార్లు చూడటానికి కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయని అన్నారు. ఇవి రెండు నుంచి నాలుగు వారాల పాటు ఉంటాయని, అయితే ఇతరులకు కనిపించనంత మాత్రాన వ్యాధిబారిన పడనట్లు కాదని స్పష్టంచేశారు.
ఐరోపా, అమెరికా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంకీపాక్స్ సాంక్రమణకు సెక్స్‌కు సంబంధం ఉందని గతవారం డబ్ల్యూహెచ్ఓ టాప్ అడ్వైజర్ పేర్కొన్నారు. అయితే ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో మాత్రం ఇది అడవి ఎలుకలు, ప్రైమేట్స్ వంటి జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. ఈ అంటువ్యాధి సరిహద్దులు దాటిపోలేదని తెలుస్తోంది.
మంకీపాక్స్ వ్యాధిగ్రస్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, చలి, నీరసం వంటి లక్షణాలుంటాయి. వైరస్ తీవ్రంగా ఉన్నవారిలో ముఖం, చేతులపై దద్దుర్లు, గాయాలవుతాయి. అవి ఇతర భాగాలకు వ్యాప్తిచెందే అవకాశం ఉంది.