WHO chief scientist on Covid: కరోనా మహమ్మారిని మూడేళ్ళుగా చవిచూస్తున్నా దాని గురించి మనకు ఇంకా పూర్తిగా అర్థం కావడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో కొత్త వేవ్‌లతో ఎందుకు, ఎలా విరుచుకుపడుతుందో కూడా తెలియడం లేదన్నారు. వీటికితోడు ఈ మహమ్మారి వల్ల దీర్ఘకాలంలో కనిపించే (లాంగ్ కొవిడ్) దుష్ప్రభావాలు ఏమిటన్నవీ ఇంకా తెలియకపోవడం మరో ప్రమాదకర పరిణామమని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రాబల్యం, తదనంతర పరిణామాలపై బ్రిటిష్ మెడికల్ జర్నల్ (BMJ) ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు.
వివిధ ప్రదేశాల్లో వివిధ రూపాల్లో..:'వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వివిధ రకాలుగా ప్రవర్తిస్తోంది. వ్యాధి ప్రాబల్యం, మరణాలు ఎక్కువగా పెద్దవయసు వారిలోనే ఉన్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తోన్న నివేదికల ఫలితాలు ఒకేవిధంగా లేవు. చాలా దేశాల్లో ఒకే విధమైన పరీక్షా పద్ధతులు, జన్యుక్రమం విశ్లేషణ సామర్థ్యాలు ఒకే విధంగా లేవు' అని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. అందుకే వివిధ దేశాల్లో కొత్త వేవ్‌ల రూపంలో ఎందుకు, ఎలా విజృంభిస్తోందనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని అన్నారు.
లాంగ్ కొవిడ్‌పై ఆందోళనే..: 'తీవ్ర వ్యాధి బారినపడి కోలుకున్న కరోనా బాధితుల్లో చాలా కాలంపాటు పలు లక్షణాలు వేధిస్తున్నాయని మనకు తెలుసు. కొవిడ్ సోకిన వారికి మధుమేహం, హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశం రెండు, మూడు రెట్లు అధికంగా ఉండే అవకాశముందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే వైరస్ ఏదో చేస్తోందని అర్థమవుతోంది' అని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ఈ లాంగ్‌కొవిడ్ అనేది కేవలం శ్వాసకోశ మార్గాలనే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలనూ ప్రభావితం చేస్తోందన్నారు. అంతేకాకుండా దీర్ఘకాల కొవిడ్ ప్రభావం మెదడు, గ్రాహణశక్తిపైనా ప్రభావాన్ని చూపిస్తోందని వస్తోన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. అందుకే ఇతర శ్వాసకోస వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ విభిన్నంగా ఉందనే విషయం స్పష్టమవుతోందని డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు.
పాన్-కరోనా వ్యాక్సిన్:కరోనా వైరస్‌లు అన్నింటినీ ఎదుర్కొనేందుకు ఒకే రకమైన టీకా రావాల్సిన అవసరం ఎంతో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొవిడ్‌కు సంబంధించి భారీస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నందున వచ్చే రెండేళ్లలో ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే పాన్-కరోనా వ్యాక్సిన్‌పై ఆశాజనకంగా ఉన్నట్లు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:' అధిక వ్యాక్సినేషన్‌తోనే కొవిడ్ మరణాలను అడ్డుకోగలం'