తెలంగాణ

telangana

ETV Bharat / international

'జీ-20'లో జెలెన్‌స్కీ స్పీచ్​.. నాటో దేశం పొలండ్​పైకి పుతిన్ సేన క్షిపణులు - రష్యా లేటెస్ట్​ న్యూస్​

జీ 20లో జెలెన్​స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన వేళ రష్యా మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో కీవ్ నగరం సహా పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. మరోవైపు, జీ-20 సమావేశాన్ని జీ-19 సదస్సుగా అభివర్ణించిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. కూటమి నుంచి రష్యాను బహిష్కరించాలని కోరారు.

G20 Summit in bali
zelenskey speech in g20 summit

By

Published : Nov 16, 2022, 6:44 AM IST

Updated : Nov 16, 2022, 7:21 AM IST

Russia Ukraine War G20 Summit: జీ-20 వేదికగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్ధ సంక్షోభాన్ని ప్రస్తావించిన వేళ ఆ దేశంపై రష్యన్‌ సేనలు మరోసారి భీకర దాడులతో విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా మంగళవారం క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో రాజధాని కీవ్‌ సహా పలు నగరాల్లో ఎమర్జెన్సీ సైరన్‌ల మోతలు మోగాయి.

కీవ్‌లోని పెచెర్స్క్ డిస్టిక్‌పై జరిపిన క్షిపణి దాడుల్లో పలు నివాస భవంతులు ధ్వంసమయ్యాయని నగర మయర్‌ విటాలీ క్లిట్‌ష్కో వెల్లడించారు. గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో కీవ్‌పై ప్రయోగించిన పలు రష్యన్‌ క్షిపణులను నేలకూల్చినట్లు తెలిపారు. ఇది రష్యా పనేనంటూ జెలెన్‌స్కీ కార్యాలయ డిప్యూటీ హెడ్ కిరిలో తిమోషెంకో ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

'జీ-20 సమావేశంలో మాట్లాడినందుకే..!'
తాజా దాడులతో.. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కివ్‌, ల్వివ్‌ సహా ఉక్రెయిన్‌వ్యాప్తంగా ఆయా చోట్ల విద్యుత్‌ సరఫరాలో ఆటంకం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. సుమీ తూర్పు ప్రాంతంలో, పశ్చిమాన ఉన్న రివ్నేలో ఇంధన వసతులే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలిపారు. జెలెన్‌స్కీ ఆన్‌లైన్‌ వేదికగా జీ-20 సదస్సులో మాట్లాడినందుకే.. ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్లు ప్రెసిడెన్షియల్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ యాండ్రీ యెర్మక్‌ ఆరోపించారు.

సైనిక చర్య ముగించేలా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్‌స్కీ ఆ సందర్భంగా జీ-20 నేతలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 'మాస్కో నిజంగా శాంతిని కోరుకుంటోందని ఎవరైనా భావిస్తున్నారా? అది కేవలం తాను చెప్పిందే చేయాలని భావిస్తోంది. ఏదేమైనా.. అఖరుకు ఉగ్రవాదులు ఓడిపోతారు' అని యెర్మక్ అన్నారు.

పోలండ్‌పైకి దూసుకెళ్లిన రష్యా క్షిపణులు.. ఇద్దరి మృతి
ఉక్రెయిన్‌ పొరుగున ఉన్న నాటో సభ్య దేశం పోలండ్‌పైకి మంగళవారం రష్యా క్షిపణులు దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. వాటి తీవ్రతకు ఓ గ్రామంలో ఇద్దరు మృత్యువాతపడ్డారని అమెరికా నిఘా విభాగం అధికారి ఒకరు తెలిపారు. దాడి చోటుచేసుకున్న ఊరు ఉక్రెయిన్‌తో సరిహద్దుల్లో ఉందని పేర్కొన్నారు. పోలండ్‌ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. అక్కడి మీడియాలో మాత్రం క్షిపణుల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొచ్చాయి.

జీ-20 కాదు.. జీ-19
ఖేర్సన్‌ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం రెండో ప్రపంచయుద్ధంలో డీ-డే రోజు మిత్రదేశాలు ఫ్రాన్స్‌లో అడుగుపెట్టడంలాంటిదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ అభివర్ణించారు. ఈ రెండు సంఘటనలు అంతిమ గెలుపు మార్గాల్లో గొప్ప మలుపులని పేర్కొన్నారు. జీ-20 సమావేశాన్ని జీ-19 సదస్సుగా అభివర్ణించిన ఆయన ఈ కూటమి నుంచి రష్యాను బహిష్కరించాలని కోరారు. జీ-20 కూటమి శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మంగళవారం ఆయన వీడియోలింక్‌ ద్వారా ప్రసంగించారు.

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడిన నేరంపై రష్యా సైన్యం, రాజకీయనేతలను విచారించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే యుద్ధంలో సంభవించిన మరణాలు, విధ్వంసానికి నష్టపరిహారం కోసం అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించాలన్నారు.

  • రష్యా చెర నుంచి ఖేర్సన్‌ను స్వాధీనపరచుకోవడం ఉక్రెయిన్‌కు భారీ విజయమే. అయితే తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా రష్యా ఆధీనంలోనే ఉన్నాయి. అక్కడ యుద్ధం కొనసాగుతోంది.
  • తిరిగి స్వాధీనమైన ప్రాంతాల్లో రష్యా కొనసాగించిన హింసాకాండపై దర్యాప్తు సాగించనున్నట్లు ఉక్రెయిన్‌ పోలీసులు ప్రకటించారు. అలాగే బలవంతపు అదృశ్యాలు, నిర్బంధాలపై పరిశీలన జరపనున్నట్లు ఐక్యరాజ్య సమితి పరిశోధకులు వెల్లడించారు.

ఐరాస తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరం
ఉక్రెయిన్‌పై దాడులకు దిగడం ద్వారా రష్యా అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనకు పాల్పడిందని, యుద్ధంతో సంభవించిన నష్టాలు, మరణాలకు కీవ్‌కు మాస్కో నష్టపరిహారం చెల్లించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీసుకొచ్చిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. అయితే ఈ తీర్మానం 94 అనుకూల ఓట్లతో ఆమోదం పొందింది. దీనిని వ్యతిరేకిస్తూ 14 దేశాలు ఓటేయగా, 73 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

Last Updated : Nov 16, 2022, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details