Western Countries Supporting Israel : హమాస్ ఉగ్రవాదుల దాడితో కల్లోల పరిస్థితులు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌కు అండగా ఉండేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. హమాస్ నుంచి రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ చేసే అన్ని ప్రయత్నాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం, యూకే ప్రధాని రిషి సునాక్ నివాసం సహా పలు చారిత్రక కట్టడాలు, అధికారిక భవనాలపై నీలం, తెలుపు వర్ణాలను ప్రదర్శించాయి.
అమెరికాలో వైట్‌హౌస్, న్యూయార్క్‌లోని ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్, యూకే పార్లమెంట్ ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్, బ్రస్సెల్స్‌లోని ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం, ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ , ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్, బెర్లిన్‌లోని ది బ్రాండెన్‌బర్గ్ గేట్ తదితర చారిత్రక కట్టడాలపై ఇజ్రాయెల్ జెండాను, ఆ దేశ జెండాలోని నీలం, తెలుపు రంగులను ప్రదర్శించారు.
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ఉగ్రవాదులు పాల్పడిన మారణ హోమాన్ని చూసి యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని ఆయా దేశాలు పేర్కొన్నాయి. ఎన్నో కుటుంబాలను మిలిటెంట్లు చిదిమేశారని, మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడ్డారని దుయ్యబట్టాయి. హమాస్ ఉగ్ర చర్యలను ఎవరూ సమర్థించరని, వాటిని విశ్వమంతా ఖండించాలని పేర్కొన్నాయి. ఇలాంటి అరాచక దాడుల నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఇజ్రాయెల్ చేపట్టే ప్రతి చర్యకు తాము అండగా ఉంటామని ఈ దేశాలు సంఘీభావం ప్రకటించాయి.
'భారత ప్రజలు ఇజ్రాయెల్ వైపు'
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఈ క్రమంలో హమాస్‌తో యుద్ధ పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రధాని.. మోదీకి వివరించారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్ వైపు నిలబడతారని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా భారత్ నిస్సందేహంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. 'హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న యుద్ధ పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఫోన్ కాల్ ద్వారా అప్డేట్ ఇచ్చారు.' అని మోదీ ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.