Wagner Group Revolt : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. యుద్ధ భూమిలో ఇప్పటివరకు ఆశించిన ఫలితం దక్కని పుతిన్ ప్రభుత్వానికి.. తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైనికచర్యలో రష్యా బలగాలకు అండగా ఉన్న వాగ్నర్ గ్రూప్.. తాజాగా తిరుగుబావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రతినబూనింది. ఈ క్రమంలో తమకు అడ్డుగా వచ్చే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు వాగ్నర్ సేన అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సవాళ్లపై వాగ్నర్ సేన అధిపతి ఎప్పటికప్పుడు బహిరంగంగా..
Russia Wagner Group : ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్ సేన అధిపతి ఎప్పటికప్పుడు బహిరంగంగా.. తన అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. రష్యా రక్షణ శాఖపై తీవ్ర అసహనంతో ఉన్న ఆయన.. రష్యా సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాగ్నర్ దళాలు రష్యా దక్షిణ ప్రాంతమైన రొస్తోవ్‌లోకి ప్రవేశించాయని.. తమకు ఎదురయ్యే అడ్డంకులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తామని ప్రకటనలో ప్రిగోజిన్ హెచ్చరించారు. ఇది సైనిక తిరుగుబాటు కాదని.. న్యాయం కోసం చేస్తోన్న మార్చ్ అని వ్యాఖ్యానించారు. అయితే ఆ క్లిప్‌లో ఉన్న వ్యాఖ్యలు ఎవరివనేదానిపై పూర్తిస్థాయి స్పష్టత లేదు.
రష్యా సైనిక నాయకత్వం లక్ష్యంగానే
Ukraine Russia War :రష్యా సైనిక నాయకత్వం లక్ష్యంగానే వాగ్నర్ సేనలు ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. అధ్యక్షుడి అధికారాలు, ప్రభుత్వం, పోలీసులు, రష్యా గార్డ్స్ విధులకు ఎలాంటి ఆటంకం ఉండదని ప్రిగోజిన్ చెబుతుండగా ఆయన ఆగ్రహమంతా సైనిక నాయకత్వంపైనే అని స్పష్టమవుతోంది. యుద్ధం పేరుతో రష్యా రక్షణ శాఖ తన దళంలోని అనేకమందిని హతమార్చిందని వాగ్నర్ అధిపతి ఆరోపించారు. అందుకు తగ్గట్టే రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగు ఉన్న రొస్తోవ్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రష్యా సైన్యంతో భీకర పోరాటం జరిగినట్లు తెలిపారు.
భద్రత కట్టుదిట్టం..
ఈ అనూహ్య పరిణామంతో రష్యా అధినాయకత్వం అప్రమత్తమైంది. రాజధాని మాస్కో సహా రష్యాలోని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రారంభిస్తున్నట్లు మాస్కో మేయర్ ప్రకటించారు. రష్యా దక్షిణ ప్రాంతాలైన రొస్తోవ్, లిపెట్స్క్‌లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.ఆ ప్రాంతాల్లోని ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.
వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ వాగ్నర్ చీఫ్‌పై క్రిమినల్ కేసు నమోదు..
Wagner Chief : మరోవైపు వాగ్నర్ చీఫ్‌పై రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్-FSB క్రిమినల్ కేసు పెట్టింది. వాగ్నర్ సేనలు.. ప్రిగోజిన్ ఆదేశాలను పట్టించుకోవద్దని, వెంటనే అతడిని అరెస్టు చేయాలని ఆదేశించింది. ప్రైవేటు సైన్యం చేస్తోన్న ఈ తిరుగుబాటును ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు పుతిన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. పుతిన్ ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూప్.. ఇప్పటి వరకూ రష్యా సైన్యం తరఫున ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తూ వచ్చింది. ఈ గ్రూప్‌లో 60వేల మందికిపైగా సైనికులు ఉన్నారు. వీరు రష్యాకు, పుతిన్‌కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు. ఈ బృందానికి సంబంధించిన 400 మందిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు పురమాయించినట్లు ఇటీవల వార్తలు వార్తలొచ్చాయి.
పలు దేశాల్లో..
Wagner Group Russia : పలు దేశాల్లో వాగ్నర్ గ్రూప్ కదలికలు ఉన్నాయి. లిబియా సివిల్ వార్, సిరియా, మోజాంబిక్, మాలి, సుడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనుజువెలావంటి దేశాల్లో వాగ్నర్ గ్రూప్ ఉంది. సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది. దాదాపు 2,500 మంది వాగ్నార్ సభ్యులు అసద్ రక్షణతో పాటు కీలక సైనిక స్థావరాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. సిరియాలోని చమురు బావుల్లోని కొంత వాటా కూడా ఈ గ్రూప్ తీసుకొనేలా ఒప్పందాలు జరిగాయి. 2018లో సిరియాలో అమెరికా దళాలు వాగ్నర్ గ్రూప్ మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో దాదాపు 300 మంది వాగ్నర్ సభ్యులు మరణించినట్లు వార్తలొచ్చాయి.