Wagner Group New Chief :రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటుకు (Wagner Group Rebellion) తెరలేపిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేతయెవెగనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన మృతిని క్రెమ్లిన్ ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మృతదేహాల వైద్యపరీక్ష అనంతరమే ప్రకటన చేస్తామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే వాగ్నర్ గ్రూప్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. రష్యాకు విధేయంగా ఉంటామని ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాలని వాగ్నర్ సైనికులను పుతిన్ ఆదేశించినట్లు తెలిపాయి. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన సైనికచర్యలో పాల్గొంటున్న ప్రైవేటు సైనికులందరూ ఈ ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయాల్సిందేనని క్రెమ్లిన్ తమ వెబ్‌సైట్‌లో ప్రచురించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు విమాన ప్రమాద ఘటనపై పుతిన్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేసినప్పటికీ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి అని అనుకున్న ఫలితాలు సాధించాడని పుతిన్ కొనియాడారు. ప్రిగోజిన్ మరణంతో వాగ్నర్ కిరాయి సైన్యం పగ్గాలు సిడాయ్ పేరుతో పిలిచే ఆండ్రీ ట్రోషేవ్ చేతికి వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత ఇకనుంచి ఆ గ్రూపు బాధ్యతలను ఆండ్రీ ట్రోషేవ్ చూసుకుంటారని పుతిన్ గతంలో ప్రకటించారు.