Wagner Group Chief Yevgeny Prigozhin : రష్యాధీశుడు పుతిన్‌కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేసిన కిరాయి సైనిక ముఠా వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అమెరికా నిఘా సంస్థ CIA హెచ్చరించింది. ముఖ్యంగా తెరిచిన కిటికీల వద్ద ప్రిగోజిన్ చాలా జాగ్రత్తగా ఉండాలని CIA చీఫ్ డేవిడ్ పేట్రాయస్ పేర్కొన్నారు. పుతిన్ విరోధులు చాలా మంది ఇలా కిటికీల నుంచి కిందపడి చనిపోయారని పేట్రాయిస్ గుర్తు చేశారు. ఆవేశంలో రష్యా సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్.. వెనక్కి తగ్గి ప్రస్తుతానికి మాత్రమే ప్రాణాలు రక్షించుకున్నాడని తెలిపారు. వాగ్నర్ దళాల నుంచి ఆయనను వేరు చేసి బెలారస్‌కు పంపారని పేర్కొన్నారు. వాగ్నర్ సైన్యాన్ని ప్రిగోజిన్ పోగొట్టుకున్నట్లు వివరించారు.
Wagner Group Revolution In Russia : ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 19 మంది రష్యా ఒలిగార్క్‌లు అనుమానాస్పద స్థితిలో మరణించారు. అందులో పుతిన్ విమర్శకులే అనేకులు. క్రెమ్లిన్‌కు ఎదురు నిలిచిన వారు కిటికీల నుంచి కిందపడి చనిపోయిన ఘటన సోవియట్, రష్యా చరిత్ర కోకొల్లలు. రష్యా MP పావెల్ అంటోవ్ భారత్‌లో ఓ హోటల్ మూడో అంతస్తు కిటికీ నుంచి కిందపడి మరణించారు. 2 రోజుల్లోనే మరో రష్యన్ భారత్‌లోనే మృతిచెందాడు.
మరోవైపు ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు పెట్టినట్లు రష్యా భద్రతాసేవల విభాగం(FSS) తెలిపింది. తిరుగుబాటును విరమించుకుంటే ఆయనపై ఉన్న క్రిమినల్ కేసు ఎత్తివేత సహా భద్రతకు హామీ ఇచ్చిన రష్యా.. ఇప్పుడు తిరిగి ఆయనపై కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. నేరతీవ్రత, ఘర్షణలు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా మీడియా తెలిపింది. క్రిమినల్ కేసు ఎత్తివేస్తారన్న హామీ మేరకు బెలారస్ వెళ్లినట్లు భావిస్తున్న ప్రిగోజిన్ ఇప్పటి వరకు ఎక్కడున్నారో అనేది తెలియరాలేదు. ఆయనను రష్యా ఇప్పటికే విచారిస్తోందని ఆదేశ మీడియా వెల్లడి చేసింది. అటు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో పుతిన్ సన్నిహితుడు కావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్‌ను బెలారస్‌లోనే చంపుతారన్న వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.