Vivek Ramaswamy Polls :అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి.. రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య జరిగిన తొలి బహిరంగ చర్చలో ఆయనే ఫేవరెట్‌గా నిలిచారు. చర్చలో వివేక్ రామస్వామి మెరుగైన ప్రదర్శన చేశారని పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ బహిరంగ చర్చ తర్వాత ఆయనకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.
Republican Primary Debate :రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఎనిమిది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అందులో ఆరుగురు బుధవారం జరిగిన డిబేట్లో పాల్గొన్నారు. ఇందులో వివేక్ రామస్వామితో పాటు మరో భారత సంతతి నేత నిక్కీ హేలీ ఉన్నారు. ఈ చర్చ తర్వాత వివేక్ రామస్వామి పేరు విపరీతంగా మారుమోగిపోతోంది. దీంతో పాటు ఆయనకు అందే విరాళాల మొత్తం కూడా గణనీయంగా పెరిగిందని వార్తా కథనాలు చెబుతున్నాయి.
సర్వేలో టాప్
Vivek Ramaswamy Republican Party : రేసులో ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, సౌత్ కరోలీనా గవర్నర్ నిక్కీ హేలీని.. వివేక్ వెనక్కి నెట్టినట్లు సర్వేలో వెల్లడైంది. ఓ సర్వేలో.. చర్చపై 504 మంది అమెరికన్ల అభిప్రాయం కోరగా.. 28 శాతం మంది వివేక్ రామస్వామి మెరుగైన ప్రదర్శన చేశారని చెప్పుకొచ్చారు. డిసాంటిస్ 27 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. పెన్స్‌కు 13 శాతం, నిక్కీ హేలీకి 7 శాతం మంది మద్దతు పలికారు.