Vivek Ramaswamy On Trump :అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. వివేక్ అవినీతిపరుడు, ఆర్థికనేరగాడని, తన మద్దతుదారులెవరూ ఆయనకు ఓటేయొద్దని కోరారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయతిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
ట్రంప్ విమర్శలపై స్పందించిన వివేక్, ప్రచార సలహాదారుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమన్నారు. స్నేహపూర్వక ఆరోపణలు ఇకపై పనిచేయవనీ, అంతేకాకుండా ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలని కోరుకోవటం లేదన్నారు. ట్రంప్ 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడని వివేక్ రామస్వామి మరోసారి ప్రశంసించారు. అయితే, న్యాయపరమైన చిక్కులు, రాజకీయ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"నన్ను విమర్శిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన పోస్టు చూశాను. ఆయన ప్రచార సలహాదారుల సూచనతో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి తలెత్తింది. ఇకపై స్నేహపూర్వకమైన ఆరోపణలు ఏ మాత్రం పనిచేయవని భావిస్తున్నా. ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలనుకోవడంలేదు. ఆయన 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడు. అయోవా ప్రచారంలో ట్రంప్ మద్దతుదారులను కలిశాను. వారంతా ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళనగా ఉన్నారు."
-- వివేక్ రామస్వామి, అధ్యక్ష ఎన్నికల పోటీదారుడు