Vivek Ramaswamy On H1B Visa : తన ప్రసంగాలతో, సరికొత్త ప్రకటనలతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ ఆశావహుడు, భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి. తాజాగా.. తాను అధ్యక్షుడిని అయితే హెచ్1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత విధానాన్ని ఎత్తేసి.. దాని స్థానంలో మెరిట్ ఆధారిత విధానాన్ని తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇక ప్రస్తుతమున్న హెచ్చ్1బీ వీసా విధానాన్ని 'ఇండెంట్డ్ సర్విట్యూడ్' (ఒప్పంద దాస్యం)గా అభివర్ణించారు. ఇది కేవలం దాన్ని జారీ చేసే కంపెనీకే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఇక కుటుంబాలతో సహా వచ్చే వ్యక్తులు నైపుణ్యాలు ఉన్నవారు కాదని చెప్పారు.
H1 B Visa USA : హెచ్1బీ వీసా అనేది.. వలసదారుల వీసా. ఇది అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం ఉన్న వలసదారులను నియమించుకోడానికి అనుమతిస్తుంది. హెచ్1బీ వీసాను భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకుంటారు. అమెరికన్ కంపెనీలు.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఇలాంటి వారిని నియమించుకుంటాయి. అయితే, రామస్వామి.. తన ఫార్మా కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం ఉద్యోగులను నియమించుకోడానికి 29 సార్లు H1B వీసాను ఉపయోగించుకున్నారు.
ఏటేటా హెచ్1బీకి పెరుగుతున్న డిమాండ్..
హెచ్1బీ వీసాల కోసం ఏటేటా భారీ డిమాండ్ ఏర్పడుతోన్న నేపథ్యంలో.. వివేక్ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి. 2021 గణాంకాల ప్రకారం, అక్కడ 85వేల మందికి అవకాశం ఉండగా.. సుమారు 8లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఇచ్చే 85 వేలల్లో 65 వేలు అందరికీ అందుబాటులో ఉంటుండగా.. 20 వేల వీసాలు మాత్రం అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారే పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వీసాలపై కఠిన వైఖరి అవలంబించిన డొనాల్డ్ ట్రంప్.. వీటి సంఖ్యను నిరోధించే ప్రయత్నం చేశారు.