తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో కరోనా విలయం.. ఆస్పత్రులు ఫుల్.. రోజుకు 5వేల మంది మృతి! - చైనా కొవిడ్ న్యూస్

కరోనా బాధితులతో చైనాలోని పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్‌ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను భద్రపరిచేందుకు కూడా ఫ్రీజర్లు సరిపోకపోవడం వల్ల మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

CHINA VIRUS NEWS
CHINA VIRUS NEWS

By

Published : Dec 22, 2022, 10:45 PM IST

జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలికిన చైనాలో కరోనా కేసులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. అయితే, మున్ముందు అక్కడ పరిస్థితి తీవ్ర రూపం దాల్చబోతోందంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో రోజుకు 10 లక్షల కేసులు.. 5 వేల చొప్పున మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని తాజాగా అధ్యయనం ఒకటి పేర్కొంది. రానున్న రోజుల్లో అక్కడి పరిస్థితులు తీవ్రంగా మారబోతున్నాయని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ తన అంచనాలను వెలువరించింది.

చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కోరలు చాస్తోంది. ఈ వేవ్‌ ద్వారా జనవరి నెలలో రోజుకు గరిష్ఠంగా 37లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని ఎయిర్‌ఫినిటీ సంస్థ అంచనా వేసింది. మార్చిలో మరోసారి కొవిడ్‌ పీక్‌ దశకు చేరుకుంటుందని, ఆ సమయంలో 42 లక్షల కేసులు వెలువడే అవకాశం ఉందని తెలిపింది. చైనా కొవిడ్‌ కేసులు, మరణాలకు సంబంధించి రాష్ట్రాల స్థాయిలో వచ్చిన డేటాకు, అధికారికంగా వెలువరిస్తున్న డేటా మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని ఎయిర్‌ఫినిటీ ఆరోపించింది. చైనాలో బుధవారం కేవలం 2,996 కేసులు మాత్రమే వచ్చాయని, డిసెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 10 కంటే తక్కువ మరణాలు సంభవించినట్లు చైనా అధికారికంగా పేర్కొందని తెలిపింది.

వాస్తవానికి చైనా ఆస్పత్రులు, శ్మశాన వాటికల వద్ద పరిస్థితులకు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మాస్‌ టెస్టింగ్‌ బూత్‌లను చైనా నిలిపివేసిందని, దీంతో చాలా మంది ఇంటి వద్దే కరోనా టెస్టులు చేసుకుంటున్నారని ఎయిర్‌ఫినిటీ తెలిపింది. కరోనా మరణంగా పేర్కొనేందుకు ఉన్న నిర్వచనాన్ని సైతం చైనా మార్చివేసిందని పేర్కొంది. దీంతో వాస్తవంగా ఎన్ని కేసులు, మరణాలు సంభవిస్తున్నాయనేది తెలీడం లేదని సదరు సంస్థ తెలిపింది. మరణాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం ఇది అని ఎయిర్‌ఫినిటీ వ్యాక్సిన్‌, ఎపిడమాలజీ హెడ్‌ లూయిస్‌ బ్లెయిర్‌ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ కారణంగా ఈ ఏడాది జనవరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగా అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య 14 లక్షలుగా నమోదు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 4 లక్షలుగా ఉందని ఆయన తెలిపారు.

చాంగ్‌క్వింగ్‌ వైద్య విశ్వవిద్యాలయ ఆస్పత్రిలోని మొత్తం రోగుల్లో.. దాదాపు 80 నుంచి 90 శాతం కరోనా బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. వయోవృద్ధులపై ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉండటంతో పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే. మృతుల సంఖ్య విషయంలో చైనా నిజాన్ని దాస్తోందన్న అనుమానాలూ ఉన్నాయి. ఆస్పత్రుల్లోని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న పలువురు సిబ్బందికి కూడా ఈ మహమ్మారి సోకుతోంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరుకావాల్సి వస్తోందంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 10 గంటలకు పైగా విధులు నిర్వర్తించాల్సివస్తోందని అంటున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి చాంగ్‌క్వింగ్‌కు వచ్చిన బాధితుల, వారి బంధువుల వాహనాలు బారులు తీరాయి. దీంతో ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది.

షాంఘైలోని వివిధ ఆస్పత్రులు, అత్యవసర విభాగాలు స్ట్రెచర్లతో నిండిపోయి ఉన్నాయి. చాలా మంది బాధితులకు ఆక్సిజన్‌ అందించాల్సి వస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్‌ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు. చైనా వ్యాప్తంగా ఇంకా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. లక్షలాది మంది ప్రజలు ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ తీసుకోలేదని రికార్డులు చెబుతున్నాయి. ఇది కూడా కొవిడ్‌ ఉద్ధృతికి ఓ కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశంలో చోటు చేసుకుంటున్న చాలా మరణాలకు కరోనా వైరస్‌ కారణం కాదని ఆ దేశం వాదిస్తోంది. ప్రభుత్వ లెక్కల్లో తప్పుగా చూపిస్తోంది. మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా సరిపోవట్లేదని షాంఘై అధికారులు వెల్లడించారు. మృతి చెందిన రోజునే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details