Brazil cops: బ్రెజిల్లో ఓ నల్లజాతీయుడి పట్ల ఇద్దరు పోలీసులు అత్యంత కర్కషంగా వ్యవహరించారు. అతడ్ని మోకాళ్లతో నొక్కిపట్టి హింసించారు. ఆ తర్వాత తీసుకెళ్లి ఎస్యూవీ డిక్కీలో పడేశారు. టియర్ గ్యాస్ ఆన్ చేసి అతడ్ని ఊపిరాడకుండా హింసించారు. ప్లీజ్ నన్ను వదిలేయండని అరుస్తూ ప్రాధేయపడినా పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించారు. డిక్కీ నుంచి బాధితుడి కాళ్లు బయటకు కన్పించాయి. అతను గిలాగిలా కొట్టుకోవడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. అయినా చుట్టుపక్కల వారిని పోలీసులు అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత బాధితుడు జెనివాల్డో డి జీసస్ శాంటోస్ను(38) పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఊపిరాడకపోవడం వల్లే శాంటోస్ మరణించాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. సెర్గిపె రాష్ట్రంలో యుంబౌబలో మంగళవారం ఈ ఘటన జరిగింది.
Brazil police brutality: ఈ విషయం తెలిసి బ్రెజిల్ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. పోలీసులే శాంటోస్ను హత్యచేశారని దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. పోలీసుల క్రూర చర్యను తీవ్రంగా ఖండించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే ఫెడరల్ హైవే పోలీసులతో శాంటోస్ దురుసుగా ప్రవర్తించాడని అధికారులు తెలిపారు. అతడు తిరగబడటం వల్లే పోలీసులు అతడ్ని బంధించారని పేర్కొన్నారు. శాంటోస్ను నియంత్రించాలనే ఉద్దేశంతోనే టియర్ గ్యాస్ ప్రయోగించారని వివరణ ఇచ్చారు. అది ప్రాణాంతకం కాదని చెప్పారు.