తెలంగాణ

telangana

ETV Bharat / international

24వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య.. 105 గంటలు పోరాడి గెలిచిన చిన్నారి - తుర్కియే భూకంపం 105 గంటలు పోరాడి గెలిచిన చిన్నారి

తుర్కియేలో సంభవించిన భూకంపంలో ఏకంగా 101 గంటలపాటు చిక్కుకున్న బాధితులలో పలువురిని రక్షణ బలగాలు సురక్షితంగా బయటకు తీశారు. ఓ యువకుడు మూత్రం తాగి ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ఈ ప్రకృతి విలయతాండవానికి ఇప్పటికి తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య 24 వేలు దాటింది.

Turkey earthquake
తుర్కియే భూకంపం

By

Published : Feb 11, 2023, 6:54 AM IST

ఒకటి కాదు.. రెండు కాదు.. 101 గంటల పాటు వారంతా ఓ భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. తినడానికి ఆహారం, తాగడానికి నీళ్లు లేకపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అద్నాన్‌ మహమ్మద్‌ కోర్కుట్‌ అనే 17 ఏళ్ల యువకుడు దాహార్తికి తాళలేక తన మూత్రాన్నే తాగాడు!! చలిగాలులు వణికిస్తున్నా, ఎటూ కదిలేందుకు వీల్లేకపోయినా మృత్యువుతో పోరాటంలో వీరంతా విజయం సాధించారు. తుర్కియేలో సహాయక చర్యలు చేపడుతున్న బలగాలు గాజియాంతెప్‌లో ఈ మృత్యుంజయులను శుక్రవారం సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి.

ప్రాణాలతో ఉండేందుకు నాలుగు రోజులకు పైగా వారు పడిన ఆరాటం గురించి తెలిశాక అక్కడివారి కళ్లు చెమర్చాయి. ఈ ప్రాంతం భూకంప కేంద్రానికి చేరువగా ఉంది. సురక్షితంగా బయటపడినవారిలో ఆరుగురు బంధువులు కూడా ఉన్నారు. మూత్రం సేవించాల్సి వచ్చిన అవసరాన్ని కోర్కుట్‌ చెబుతూ తన కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్న తల్లిని, కుటుంబీకుల్ని హత్తుకున్నాడు. నాలుగు రోజులుగా రెప్పవాల్చకుండా నిరీక్షిస్తున్న కుటుంబాలు కాస్త ఊరడిల్లాయి. ప్రాణాలతో బయటపడినవారిని ఆసుపత్రులకు తరలించారు.

105 గంటలు పోరాడి గెలిచిన చిన్నారి
అదియామన్‌ అనేచోట నాలుగేళ్ల చిన్నారి 105 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయి మొత్తానికి ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారిని తల్లివద్దకు చేర్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇస్కెందెరన్‌ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోగా అక్కడి శిథిలాల్లో 9 మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఆరుగురిని రక్షించారు. కిరిఖాన్‌లో 50 గంటల తర్వాత ఓ మహిళను జర్మనీ బృందాలు రక్షించాయి. ఇంకోచోట ఇద్దరు కౌమారప్రాయ అక్కాచెల్లెళ్లు ఇలాగే ప్రాణాలతో బయటపడ్డారు. గరిష్ఠంగా వారం రోజుల పాటు ఇలా బతికే అవకాశాలు ఉంటాయనీ, సమయం గడుస్తున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతాయని నిపుణులు చెబుతుండడంతో సహాయక బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి. నాసిరకం భవన నిర్మాణ తీరు గురించి ఏళ్ల తరబడి ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడం కూడా ప్రాణనష్టం పెరగడానికి కారణమని చెబుతున్నారు. భూకంపం కంటే ఇలాంటి భవనాలే భారీ ప్రాణనష్టాన్ని కలిగించాయని ఆవేదన చెందుతున్నారు.

బతికించిన వాట్సప్‌
శిథిలాల కింద చిక్కుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థిని వాట్సప్‌ కాపాడింది. తూర్పు తుర్కియేలోని ఓ అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాల కింద చిక్కుకున్న ఆ విద్యార్థి.. సమయస్ఫూర్తితో ఆలోచించి తన స్నేహితులకు వాట్సప్‌లో వీడియో సందేశం పంపాడు. అందులో తాను ఏ ప్రాంతంలో ఉన్నదీ చెప్పాడు. అతడి స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఆ విద్యార్థిని కాపాడారు. బంధువులు మాత్రం ఇంకా శిథిలాల కిందే ఉన్నట్లు ఆ విద్యార్థి తెలిపాడు.

ప్రభావిత ప్రాంతాల్లో సిరియా అధ్యక్షుడి పర్యటన
భూకంపం బారినపడ్డ ప్రాంతాల్లో సిరియా అధ్యక్షుడు బషార్‌ అసద్‌ తొలిసారిగా పర్యటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

కిక్కిరిసిపోతున్న శ్మశానాలు.. వీధుల్లోనే మృతదేహాలు
ఇప్పటివరకు తుర్కియే, సిరియాల్లో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 24,000 దాటింది. ఇది కచ్చితంగా ఇంకా పెరిగే అవకాశమే ఉందని అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. జపాన్‌లోని ఫుకుషిమాలో చోటు చేసుకున్న భూకంపం, సునామీల కంటే ఎక్కువ ప్రాణనష్టమిది. ఈ భూకంపం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద విపత్తు అని తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అభివర్ణించారు. ప్రాణనష్టం భారీగా ఉండడంతో శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. దుప్పట్లు, రగ్గుల్లో చుట్టిన మృతదేహాలు వీధుల్లో కనిపిస్తున్నాయి.

ఆ పాప పేరు అయా
తుర్కియేలో శిథిల భవనం కింద బొడ్డు ఊడకుండా ఉన్న పసికందును సహాయక బృందాలు రక్షించిన విషయం తెలిసిందే. ఆమెకు జన్మనిచ్చిన తల్లి సహా కుటుంబమంతా చనిపోవడంతో పాపాయికి చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడి భార్య ఆ శిశువుకు పాలు పట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యులే ఆమెకు 'అయా' అని పేరు పెట్టారు. అంటే 'అద్భుతం' అని అర్థం. ఆ పాపను దత్తత తీసుకునేందుకు వందల మంది ముందుకు వస్తున్నారు.

బాసటగా నిలుస్తాం: మోదీ
'ఆపరేషన్‌ దోస్త్‌'లో భాగంగా తుర్కియేలో భారత బలగాలు అహోరాత్రులు శ్రమిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. క్లిష్ట సమయంలో తుర్కియేకు అన్ని విధాలా బాసటగా నిలుస్తామని ట్వీట్‌ చేశారు. తుర్కియేలో భారత సైన్యం నెలకొల్పిన ఆసుపత్రిలో వంద మందికి పైగా చికిత్స పొందారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు ఆరేళ్ల మరో పాపను రక్షించాయి. ఇంతవరకు 13 మృతదేహాలను వెలికితీశాయి.

ABOUT THE AUTHOR

...view details