తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు.. ఇకపై మరింత వేగంగా ఇస్తాం'

India visa interview: భారత్‌లో వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. వీసా ప్రాసెసింగ్‌ ప్రక్రియ సైతం వేగం పుంజుకుందని వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా వీసా జారీ ప్రక్రియను.. కరోనా ముందునాటి పరిస్థితులకుతీసుకెళతామని పేర్కొంది. 2022లో లక్షా 25వేల మంది భారతీయులకు స్టూడెంట్‌ వీసాలు జారీచేసినట్లు తెలిపింది.

usa-on-visa-interview-appointment-time
usa-on-visa-interview-appointment-time

By

Published : Jan 5, 2023, 12:21 PM IST

India visa interview: భారతీయులకు అమెరికా గుడ్​న్యూస్ చెప్పింది. భారత్​లో వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. వీసా ప్రాసెసింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఇది కొవిడ్ పూర్వస్థితికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గత కొన్నేళ్లతో పోలిస్తే 2022లో భారత విద్యార్థులకు అత్యధికంగా వీసాలు జారీ చేసినట్లు నెడ్ ప్రైస్ తెలిపారు.

భారత్ సహా కొన్ని దేశాల్లో అమెరికా వీసాల కోసం దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. దీనిపై బుధవారం రోజువారీ బ్రీఫింగ్​లో భాగంగా మాట్లాడారు నెడ్ ప్రైస్. వీసా కోసం ప్రయత్నిస్తున్నవారు ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో అమెరికా వీసాలకు డిమాండ్ ఏర్పడిందని అన్నారు. వీసా ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు.

"భారత్​లోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లు రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేశాయి. 2022లోనే భారతీయులకు లక్షా 25 వేల విద్యార్థి వీసాలను అమెరికా జారీ చేసింది. 2016 తర్వాత ఇదే అత్యధికం. కానీ, కొందరు దరఖాస్తుదారులు వీసాల కోసం ఇంకా వేచిచూస్తున్నారు. వీసా ఇంటర్వ్యూ దరఖాస్తుల వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు మేం ప్రయత్నాలు చేస్తున్నాం. భారత్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తాం. తొలిసారి వచ్చే టూరిస్టులకు వీసాలు జారీ చేయడం వేగవంతం చేస్తాం. వీసా ప్రాసెసింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఇది కొవిడ్ పూర్వస్థితికి చేరుకుంటుందని భావిస్తున్నాం."
-నెడ్ ప్రైస్, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిన తర్వాత.. అమెరికాలో ఉన్నత విద్యకు భారత్‌ నుంచి మళ్లీ డిమాండ్‌ పెరిగింది. కాగా.. అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్‌ విద్యార్థుల వాటా 20 శాతం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వీసా సమస్యను పరిష్కరించాలని గతేడాది సెప్టెంబర్​లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​ను కోరారు. ఇందుకు బ్లింకెన్ సానుకూలంగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details