US congressional delegation in Taiwan : చైనాకు మరింతగా చిర్రెత్తేలా.. అమెరికా మరో ప్రతినిధి బృందం తైవాన్‌ను సందర్శించింది. అమెరికన్ కాంగ్రెస్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు స్టెఫనీ మర్ఫీ నాయకత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ఉదయం తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్వెన్‌ను కలుసుకుంది. అమెరికా దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆగస్టు నెలారంభంలో తైవాన్‌ను సందర్శించినప్పటి నుంచి విదేశీ ప్రతినిధులు ఆ దేశానికి వస్తూనే ఉన్నారు. పెలోసీ తరవాత అమెరికాకు చెందిన ఒక సెనెటర్, మరో కాంగ్రెస్ ప్రతినిధి బృందం తైవాన్‌కు వచ్చింది.
అమెరికాలోని అరిజోనా, ఇండియానా రాష్ట్రాల గవర్నర్లు కూడా తైవాన్ వచ్చి అక్కడి సెమీకండక్టర్ పరిశ్రమ నాయకులతో చర్చించారు. అమెరికా ప్రతినిధులు తైవాన్‌కకైకు రావడమంటే దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించడమవుతుందని డ్రాగన్ ఆగ్రహిస్తోంది. ఈ పర్యటనలకు నిరసనగా చైనా పెద్దఎత్తున సైనిక విన్యాసాలు జరుపుతోంది. రానున్న కొన్నేళ్లలోనే తైవాన్‌పై చైనా దండెత్తవచ్చని అమెరికా సైన్యం భావిస్తోంది. తైవాన్‌కు అమెరికా ఆయుధ సహాయం అందించాలంటూ కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టిన శాసనకర్తల్లో స్టెఫనీ మర్ఫీ కూడా ఉన్నారు. గతవారం తైవాన్‌కు 100 కోట్ల డాలర్ల ఆయుధ సహాయాన్ని బైడెన్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే.
కీవ్‌లో బ్లింకెన్ ఆకస్మిక పర్యటన
అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి అంటోనీ బ్లింకెన్ గురువారం అకస్మాత్తుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ సహా రష్యాతో ముప్పు పొంచి ఉన్న ఐరోపాలోని మరికొన్ని దేశాలకు రెండు బిలియన్ల డాలర్లకు పైబడి కొత్త సైనిక సహాయాన్ని బైడెన్ యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పలువురు ఉక్రెయిన్ సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్, దాని 18 పొరుగుదేశాలకు (నాటో సభ్యదేశాలు, ప్రాంతీయ భద్రత భాగస్వాములతో కలిపి) 2 బిలియన్ డాలర్ల విలువైన దీర్ఘకాలిక విదేశీ సైనిక రుణ సహాయాన్ని అందించాల్సిన అవసరాన్ని బైడెన్ పాలన యంత్రాంగం కాంగ్రెస్‌కు వివరించిందని బ్లింకెన్ వెల్లడించారు.