US visa delays 2022 : భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే నిపుణులు, విద్యార్థులు, పర్యటకుల కోసం అమెరికా ఎంబసీ వివిధ రకాల వీసాలు జారీచేస్తుంది. దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్‌కు పట్టే సమయాన్ని అమెరికా ఎంబసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తుంది. ఆయా ఎంబసీ, కాన్సులేట్లలో వీసా ఇంటర్వ్యూలను నిర్వహించే సిబ్బంది తదితర అంశాల ఆధారంగా.. ఈ సమయాన్ని ప్రతివారం అప్‌డేట్ చేస్తుంది. దిల్లీ ఎంబసీతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు కాన్సులేట్ల ద్వారా అమెరికా వీసాలు జారీ చేస్తోంది. వీసా కోసం నిరీక్షణ సమయాన్ని అమెరికా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించగా.. దిల్లీ ఎంబసీ నుంచి పర్యటక వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు అపాయింట్‌మెంట్ కోసం 582 రోజులపాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
అమెరికా వీసా కావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే - us visa processing time india
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్ న్యూస్. పర్యటక వీసా కావాలంటే దాదాపు ఏడాదిన్నరకుపైగా వేచి ఉండాలి. నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగం దరఖాస్తులకు 2024 మార్చి లేదా ఏప్రిల్‌లోనే వీసా అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉంది. స్టూడెంట్ వీసా కోసం దాదాపు 470 రోజులు, ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసమైతే ఆరున్నర నెలలు వేచిచూడాలి.
US visa delays India : హైదరాబాద్ నుంచి పర్యటక వీసా అపాయింట్‌మెంట్ కోసం 582 రోజులు, స్టూడెంట్, ఎక్స్ఛేంజీ పర్యటక వీసా కోసం 471 రోజులపాటు వేచి ఉండాలని అమెరికా అధికారిక వెబ్‌సైట్ చూపిస్తోంది. అమెరికా వెళ్లాలనుకునేవారి వీసా ఇంటర్వ్యూ సమయం ఎక్కువగా ఉందన్న మీడియా కథనాలకు అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ఇమ్మిగ్రెంట్, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు సాధ్యమైనంత త్వరగా జారీచేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్, సిబ్బంది కొరత కారణంగా వీసాల జారీ ఆలస్యమవుతోందని.. కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. మెడికల్ ఎమర్జెన్సీ, అంత్యక్రియలు, పాఠశాలల ప్రారంభం వంటి అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలనుకునే వారికి ఇంటర్వ్యూను వీలైనంత త్వరగా చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయని, ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది.
వీసా జారీ ప్రక్రియను వేగంగా చేపట్టేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవడం సహా కొత్తవారికి శిక్షణ ఇస్తున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. త్వరలోనే అమెరికా అధికారులు భారత్ సహా ఇతర రాయబార, కాన్సులేట్లకు చేరుకుంటారని వెల్లడించింది. అమెరికా వీసా కోసం భారత్ నుంచి దరఖాస్తులు భారీగా పెరగడం కూడా అపాయింట్‌మెంట్ నిరీక్షణ ఎక్కువగా ఉండడానికి మరొక కారణమని ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. కెనడా, యూకే వీసాల కోసం భారతీయులు చేసుకున్న దరఖాస్తులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం.