అమెరికా తన దూకుడు కొనసాగిస్తోంది! చైనా ఆగ్రహానికి కారణమైన నాన్సీ పెలోసీ పర్యటన జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే మరో అగ్రరాజ్య ప్రజాప్రతినిధుల బృందం ఆదివారం తైవాన్‌కు చేరుకుంది. ఆసియా పర్యటనలో భాగంగా మసాచుసెట్స్‌కు చెందిన డెమొక్రటిక్ సెనెటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం రెండు రోజులపాటు తైవాన్‌లో పర్యటించనుంది. అమెరికా- తైవాన్ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై ఇరుపక్షాలు చర్చిస్తాయని తైవాన్‌లోని అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది.
తైపీ, వాషింగ్టన్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ఈ పర్యటన మరొక సంకేతమని తైవాన్ విదేశాంగ శాఖ ప్రశంసించింది. 'చైనా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా కాంగ్రెస్ మరో పర్యటనను ఏర్పాటు చేసింది. డ్రాగన్ బెదిరింపులకు భయపడని స్నేహాన్ని ప్రదర్శిస్తోంది. తైవాన్ పట్ల బలమైన మద్దతును చాటుతోంది' అని పేర్కొంది. పర్యటనలో భాగంగా అమెరికా ప్రతినిధుల బృందం తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్‌తో భేటీ కానుంది. విదేశాంగ మంత్రి జోసెఫ్ వు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.